అదేదో పాత సినిమా పాట లాగ జగన్మోహన్ రెడ్డికి మంచి శకునాలు మొదలైనట్లే ఉంది. చాలాకాలంగా కోర్టుల్లో అడ్డంకిగా ఉన్న కీలకమైన కేసుల్లో కొన్ని  ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. వీటిల్లో ముఖ్యమైనవి  పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ, అమరావతి భూకుంభకోణంపై విచారణ. పేదలకు ఇళ్ళపట్టాల పంపిణీ చేయాలన్నది మూడేళ్ళ క్రిందటి నిర్ణయం. ఈ కోర్టు, ఆ కోర్టు, ఆబెంచి ఈ బెంచని తిరిగి తిరిగి చివరకు సుప్రింకోర్టు ఆదేశాలతో పట్టాల పంపిణీకి ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ దొరికింది. 26వ తేదీన పట్టాల పంపిణీ జరగబోతోంది.





ఇక అమరావతి భూకుంభకోణంపై విచారణ కూడా ఇలాంటిదే. రాజధాని పేరుతో చంద్రబాబునాయుడు అండ్ కో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణ చేయించాలని జగన్ అనుకుంటే హైకోర్టు స్టే ఇచ్చింది. దాంతో విచారణకు బ్రేకులుపడింది. ఆ బ్రేకులను క్లియర్ చేయించుకునేందుకు ప్రభుత్వానికి ఇంతకాలం పట్టింది. ఇప్పుడిప్పుడే విచారణ స్పీడవుతోంది. అలాగే మార్గదర్శి చిట్ ఫండ్స్ ముసుగులో రామోజీ దశాబ్దాల తరబడి చేస్తున్న మోసాలను అరికట్టేందుకు జగన్ రెడీ అయ్యారు. రామోజీని ఏ1గా ఆయన కోడలు శైలజను ఏ2గా సీఐడీ కేసులు నమోదుచేసి విచారిస్తోంది.





అలాగే సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని మూలపాడు (భావనపాడు) పోర్టు పనులు మొదలయ్యాయి. విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్ధాపన చేసి పనులు మొదలుపెట్టారు. విశాఖలో అదానీ డేటా సెంటర్ నిర్మాణం పనులు మొదలయ్యాయి. మచిలీపట్నం పోర్టు భూమిపూజకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  శ్రీకాకుళం జిల్లాలోని ఉత్ధానం కిడ్నీ బాధితుల కోసం నిర్మిస్తున్న 200 పడకల ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్ తొందరలోనే ప్రారంభమవబోతున్నాయి. నాడు-నేడు లో బాగుపడిన వేలాది స్కూళ్ళలో ఫలితాలు రావటం ఇపుడే మొదలయ్యాయి.





అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి కూడా సహకారం అందుతోంది. నిజానికి అప్పుల పరిమితిని పెంచుకోవటం, అనుమతించటం అంటే నెగిటివ్ ప్రభావం తప్పదు. కానీ ప్రస్తుత పరిస్ధితుల్లో అప్పులు చేయకతప్పని పరిస్ధితి. వివేకానందరెడ్డి మర్డర్ కేసుపై నెగిటివ్ ప్రచారం తెలిసిందే. అయితే మూలపాడు, భోగాపురం, అదాని డేటా సెంటర్, ఉత్థానం ఆసుపత్రి లాంటివి జనాల్లో పాజిటివ్ సంకేతాలు పంపుతాయి. వీటితో పోల్చుకుంటే వివేకా కేసు వల్ల వచ్చే నెగిటివ్ తక్కువనే చెప్పాలి. మొత్తంమీద జగన్ ప్రభుత్వానికి మంచి శకునాలు కనబడుతున్నాయనే చెప్పాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: