పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మార్పు తీసుకువస్తానని గర్జించి మరీ పార్టీ పెట్టారు. విభజన అడ్డగోలుగా జరిగిందని, అన్ని రాజకీయ పార్టీలు దీనికి కారణం అని చెబుతూనే విభజనకు పూర్తిగా సహకరించిన టీడీపీ, బీజేపీలతో  2014 ఎన్నికల్లో చెట్టపట్టాలు వేసుకున్నారు. అవినీతిని ప్రోత్సహించను అంటూనే అవినీతి ఆరోపణలు ఉన్న టీడీపీతోనే రాజకీయంగా అడుగులు వేస్తూ వచ్చారు. ఇక టీడీపీ నేతలు అంతా పంచుకుని తింటున్నారని ఎన్నికలకు ఏడాది ముందు తీవ్ర ఆరోపణలు చేసి పక్కకు జరిగిన పవన్ కళ్యాణ్ ఇపుడు అదే టీడీపీతో జత కడుతున్నారు.


పవన్ ఈ విషయంలో రాజకీయంగా తప్పులు చేస్తున్నారని సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి. పవన్ కి సినీ హీరోగా గ్లామర్ ఉంది. బలమైన సామాజికవర్గం నేపధ్యం ఉంది. ఆయన కష్టపడితే ఏపీలో మూడవ పార్టీగా గట్టిగా నిలదొక్కుకునే అవకాశం ఉంది. కానీ ఆయన జగన్ మీద ప్రారంభించిన తొలి పోరాటం కోసమే బాబు మద్దతు తీసుకుంటున్నారు. ఆ విధంగా బాబు తోడు లేకపోతే రాజకీయం చేయలేనని చెప్పకనే చెప్పుకుంటున్నారని అంటున్నారు. పవన్ బాబు నీడ నుంచి బయటపడితేనే జనసేనకు, ఆయనకు గుర్తింపు అన్నది  రాజకీయ మేధావుల మాటగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు రాజకీయ చాణక్యుడు. ఆయన ఓ మర్రిచెట్టు లాంటివారు. ఆయన నీడలో మరో  మొక్క ఎదిగే సమస్య లేదు. బాబుని పవన్ కలిస్తే  రాజకీయంగా గరిష్ట లాభం టీడీపీకే వస్తుంది.  ఎందుకంటే బాబుకు వ్యూహాలు ఉన్నాయి. కానీ ఆ పార్టీకి ఇమేజ్ కలిగిన నేతలు లేరు.


పవన్ తో దోస్తీ వల్ల బాబు సులువుగా జనంలోకి వెళ్ళగలరు. అదే పవన్ విషయం తీసుకుంటే ఆయనకు గ్లామర్ ఉంది. దాన్ని పెట్టుబడిగా పెట్టి కష్టపడి పనిచేస్తే బలమైన నాయకుడుగా పదికాలాలు ఉంటారు. కానీ పవన్ ఎందుకు అలా ఆలోచన చేయడంలేదోనని అంటున్నవారే ఎక్కువగా ఉన్నారు. బాబుతో పెట్టుకుంటే తాము ఎప్పటికీ జూనియర్ గానే ఉండాలన్న విషయాన్ని ఎట్టకేలకు  బీజేపీ గ్రహించింది. అందుకే ఆ పార్టీ టీడీపీతో పొత్తు వద్దు అంటోంది. ఆ విషయం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ చెబుతూ కుండబద్దలు కొట్టారు. మరి అదే విషయమైన ఆలోచన పవన్ ఎందుకు చేయలేకపోతున్నారన్నదే ఇక్కడ ప్రశ్న. పవన్ రాజకీయాల్లో షార్ట్ కట్ మెదడ్స్ ని అనుసరిస్తున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. మరి రాజకీయం అంటే సుదీర్ఘ ప్రయాణం. దాని కోసం అన్ని వదులుకుని ముందుకు రావాలి. కష్టపడాలి. అలా చేసిన వారికే ఫలితం ఉంటుంది. కానీ పవన్ మరో మారు బాబు మద్దతు తీసుకుని ముందుకు రావడం అంటే ఆయన్ని బాగా తగ్గించుకున్నట్లేనని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: