విశాఖలో లాంగ్ మార్చ్ కి పవన్ పిలుపు ఇచ్చారు. ఇప్పటికి పదిహేను రోజుల క్రితం లాంగ్ మార్చ్ అంటున్నా కూడా విశాఖలో పార్టీకి పెద్దగా ఉనికి లేకపోవడంతో హడావుడి మాత్రం కనిపించడంలేదు. మరో నలభై ఎనిమిది గంటల్లో పవన్ లాంగ్ మార్చ్  చేయనున్నాడు. గత ఏడాది పవన్ విశాఖ బీచ్ లో కవాతు చేస్తే సాగరంతో పోటీ పడి మరీ జనం పోటెత్తారు. అపుడు ఎన్నికలకు  ఏడాది టైం ఉండడం, పవన్ రాజకీయ బలం ఏంటో తెలియకపోవడంతో అలాంటి సీన్ కనిపించింది.


ఇపుడు మళ్ళీ విశాఖను అలా  జనసంద్రం పోటెత్తుతుందా అన్నది డౌటేనని అంటున్నారు. విశాఖలో చూసుకుంటే తాజా  ఎన్నికల్లో జనసేన తరఫున్  పోటీ చేసిన వారు సైతం జారుకున్నారు. జనసేనకు పెట్టని కోటగా ఉన్న గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య పార్టీకి  రాజీనామా చేశారు. అలాగే అనకాపల్లి నుంది ఎంపీ అభ్యర్ధిగా నిలిచిన పార్ధసారధి కూడా బీజేపీలోకి వెళ్ళిపోయారు. మిగిలిన వారు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు.


ఈ క్రమంలో పవన్ లాంగ్ మార్చ్ అని ప్రకటించారు. అదీ అలా కాకుండా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులతో ర్యాలీ అంటున్నారు. అయితే విశాఖలో జనసేనకు అంత బలం నిజంగా ఉందా అన్నది చర్చగా ఉంది.  అయితే పవన్ సినీ గ్లామర్ మీదనే నమ్ముకుని ఇపుడు లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారని వినిపిస్తోంది. మరి పవన్ చూసేందుకు సహజంగానే యువత వస్తారు. అలాగే ఆయన అభిమానులు కూడా ఉంటారు. వారు పెద్ద ఎత్తున వస్తే లాంగ్ మార్చ్ సక్సెస్ అవుతుందని ఆశలు పెట్టుకుంటున్నారు.


అయితే భవన నిర్మాణ కార్మికులు లక్షల్లో రావడం అంటూ మాత్రం జరిగే పని కాదని చెబుతున్నారు. దీనికి ముందు టీడీపీ నిర్వహించిన ఆందోళనలో సైతం భవన నిర్మాణ కార్మికులు పెద్దగా లేరు. నిజానికి కూలీ పనులు చేసుకునే వారు వేరే ఉపాధిలో ఉన్నారు. వారి తమ పొట్ట గడుపుకోవడం కోసం వేరే విధంగా అగచాట్లు పడుతున్నారు. రాజకీయ పార్టీల ర్యాలీలకు వచ్చి వారు తమ రోజులు ఇలా వేస్టుగా  గడప‌లేరు కూడా. 


అయితే పవన్ కి టీడీపీ, వామపక్షాలు  మద్దతు ఉందని ప్రకటించారు. అలాగే బీజేపీ కూడా మద్దతు ఇచ్చే అవకాశం స్థానికంగా ఉంది. దాంతో అన్ని పార్టీల ఆందోళన‌గా ఇది జరిగే అవకాశం ఉంది. ఇక విశాఖలోని మద్దిలపాలెం నుంచి జీవీఎంసీ ఆఫీస్ వరకూ రెండు కిలోమీటర్ల మేర ఈ లాంగ్ మార్చ్ జరుగుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ లాంగ్ మార్చ్ ఏర్పాట్లు పరిశీలించేందుకు ఆ పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ విశాఖ వచ్చారు. మొత్తానికి లాంగ్ మార్చ్ సక్సెస్ కోసం జనసేన బాగానే హడావుడి పడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: