సుజనా చౌదరిని బీజేపీ నాయకుడు అనేకంటే తెలుగు బీజేపీ నాయకుడిగా వ్యవహరిస్తే బాగుంటుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. “సుజనా చౌదరి లాంటి వ్యక్తుల్ని బీజేపీ నుంచి తన్ని తరిమేయాలని బీజేపీని కోరుతున్నాను” అని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న విషయం తెలీని వ్యక్తి కూడా ఏపీ రాజధానుల అంశంపై మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. మధ్యలో పార్టీ మారి వెళ్లిన వ్యక్తికి ఏం తెలుస్తాయని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా.. బీజేపీ మ్యానిఫెస్టోలో అమరావతిపై వ్యక్తపరచిన అభిప్రాయాన్ని జగన్ అసెంబ్లీలో చదివి వినిపించారు.

 

 

‘అమరావతి నిర్మాణం రియల్ ఎస్టేట్ వెంచర్ లా ఉంది. టీడీపీ హయాంలో నాణ్యమైన భూములను, ఏడాదికి మూడు పంటలు పండే భూములను తీసుకుంది. బీజేపీ అధికారంలోకి వస్తే ఈ భూములిచ్చిన రైతులు కోరితే తిరిగి అప్పగిస్తాం. ఈ ప్రక్రియలో రైతులకు పూర్తి న్యాయం చేస్తాం’ అని బీజేపీ 2019లో ఎన్నికల సందర్భంగా తన మ్యానిఫెస్టోలో సవివరంగా పొందుపరిచారని జగన్ చదివి వినిపించారు. మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాన్ని అర్ధం చేసుకోలేని బీజేపీ నాయకుడు సుజనా చౌదరి తెలిసి మాట్లాడుతున్నారో.. తెలీక మాట్లాడుతున్నారో అర్ధం కావడంలేదన్నారు. ఇంత వివరంగా ఉన్న విషయాన్ని కూడా చంద్రబాబు వక్రీకరించి చెప్పారని.. ఇందులో ఆయన సమర్ధుడని ఎద్దేవా చేశారు.

 

 

రాజధానిగా అమరావతిని మారుస్తున్నామని తాము ఎక్కడా చెప్పలేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజలను మాయ చేస్తూ వారిని రెచ్చగొడుతున్నారని చంద్రబాబు తీరుపై జగన్ మండిపడ్డారు. మరో వైపు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. అమరావతితో పాటు మరో రెండు రాజధానులను ఏర్పాటు చేస్తున్నామని సీఎం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: