కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ లోని సిర్పూర్ పేపర్ మిల్లు లో శనివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ పేపర్ మిల్లు లో విద్యుత్ ప్లాంట్ కోసమని బాయిలర్ నిర్మాణ పనులు కొనసాగుతుండగా... ఒక్కసారిగా మిల్లు లోని మట్టిపెళ్లలు కూలి అక్కడ పనిచేస్తున్న కార్మికుల మీద పడిపోయాయి. దీంతో ఏం జరుగుతుందో కూడా తెలియని 3 కార్మికులు మట్టిపెళ్లల కింద పడిపోయి తమ తుది శ్వాస విడిచారు. మరొక ఐదుగురు మట్టిపెళ్లల కింద చిక్కుకుపోయి తీవ్ర గాయాలపాలయ్యారు.




అదృష్టవశాత్తు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న ఫైర్ సిబ్బంది... మట్టిపెళ్లల కింద చిక్కుకుపోయిన ఐదుగురు కార్మికుల లోని నలుగురిని బయటికి తీయగలిగారు. వారిని వెంటనే సమీప ఆస్పత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా వారిని కూడా రక్షించేందుకు శతవిధాలా ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. విద్యుత్ ప్లాంట్ కోసం బాయిలర్ నిర్మాణ పనులు చేపట్టిన కార్మికులంతా చెన్నై నుంచి వచ్చారని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతి షిప్టులో 12 మంది కార్మికులు కలిసి పని చేస్తుంటారు. కానీ అర్ధరాత్రి జరిగిన ప్రమాద సమయంలో ఎంత మంది ఉన్నారో తెలియాల్సి ఉంది.




ఇకపోతే దుర్ఘటన జరిగిన పేపర్ మిల్లు లోకి పోలీసులను తప్ప మరే ఇతర వ్యక్తులను అనుమతించడం లేదు. వాస్తవానికి ఈ పేపర్ మిల్లు 2014లో మూతపడింది. కానీ 2018 ఆగస్టు నెలలో తెలంగాణ మంత్రి కేటీఆర్ పేపర్ మిల్లు పునరుద్దరణ పనులను ప్రారంభించారు. అప్పటినుండి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్ధరణకు ఎంతో కృషి చేయడం ఆరంభించారు. మరోవైపు కార్మికులు కూడా పేపర్ మిల్లు నిర్మాణం కొరకై ఎంతో కాయకష్టం చేశారు. కానీ అనుకోకుండా మూతపడిన పేపర్ మిల్లు ను తెరిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ దుర్ఘటన చోటు చేసుకొని ముగ్గురి కార్మికులను పొట్టన పెట్టుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: