మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న మీడియాతో ప్రధాని మోదీ తనకు కాల్ చేశాడని, తన ఆలోచనలను మోదీతో పంచుకున్నానని చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం పీఎంవో కార్యాలయానికి తాను ఫోన్ చేసి మాట్లాడాలని విజ్ఞప్తి చేయగా మోదీ కాల్ చేశారని వెల్లడించారు. ఏపీ రాజకీయవర్గాల్లో మోదీ చంద్రబాబుకు కాల్ చేయడంతో దీని గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. 
 
2019 ఎన్నికల ముందు కేంద్రం నుంచి బయటకు వచ్చిన టీడీపీ ఆ తరువాత మోదీపై, బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మోదీని విమర్శించడంతో పాటు అదే సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ తో జత కట్టాడు. మోదీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వల్ల ఈ రెండు పార్టీల మధ్య మరియు మోదీ, చంద్రబాబు మధ్య 2019 ఎన్నికల ముందు నుంచి దూరం పెరిగింది. అయితే ఆ తరువాత కాలంలో టీడీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. 
 
2019 ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన, బీజేపీ పార్టీలు దగ్గరయ్యాయి కానీ బీజేపీ టీడీపీని దూరం పెడుతూనే వస్తోంది. ఇప్పుడు మోదీ చంద్రబాబుకు ఫోన్ చేయడంతో ఇద్దరి మధ్య బంధం బలపడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ చంద్రబాబుతో మాట్లాడలేదని చెప్పారు. 
 
ఒకవేళ మోదీ చంద్రబాబుతో మాట్లాడితే ఆయన ఏం మాట్లాడారో కూడా చెప్పాలని అన్నారు. చంద్రబాబు పీఎంవో కార్యాలయానికి ఫోన్ చేయడం వాస్తవమే కానీ పీఎం చంద్రబాబుతో మాట్లాడటం అవాస్తమని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి అపోహలు సృష్టిస్తున్నారని బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఎంక్వైరీ చేయగా అసలు నిజం వెలుగులోకి వచ్చిందని పీఎం చంద్రబాబుతో మాట్లాడినట్టు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: