ఆ చిన్నారి హాయిగా ఉయ్యాలలో అటూ ఇటూ ఊగుతుంది. కానీ ఆ చిన్నారి అనుకోలేదు ఆ ఉయ్యాలే  ఉరి తాడుగా  మారుతుందని.. . చివరికి ఆనందాన్ని ఇచ్చిన ఆ ఉయ్యాలే తన  ప్రాణాన్ని బలితీసుకుంటుందని. తల్లిదండ్రులు నిర్లక్ష్యం ఐదేళ్ల బాలిక ప్రాణాలు తీసింది . ఆ చిన్నారి మెడకి  ఉరితాడు బిగుసుకొని  కనరాని లోకాలకు తీసుకెళ్ళింది. ఎంత ఆర్తనాదాలు చేసిన తల్లిదండ్రులు టీవీలో లీనమైపోవడం వల్ల వినిపించలేదు. అటుగా వచ్చిన స్థానికులు కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు పరిగెత్తుకు వచ్చారు కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం కాస్త జరిగిపోయింది. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు తమ కళ్ళముందు చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు తల్లిదండ్రులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. 

 

 

 వివరాల్లోకి వెళితే... దివ్యాంగుడు వలపర్ల రవికుమార్ కవిత దంపతులు. వీరు సత్తెనపల్లి పట్టణంలోని ఎన్విఆర్ కాంప్లెక్స్ లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరికీ స్వర్ణిక,  సాత్విక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా దివ్యాంగులు అయిన రవి కుమార్ ఎంపిడిఓ కార్యాలయం ఎదుట బడ్డీకొట్టు పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తుంటాడు. రవి కుమార్ భార్య కవిత జిరాక్స్ సెంటర్ నడుపుతోంది. ప్రస్తుతం లాక్ డౌన్  కారణంగా పిల్లలతో పాటు అందరూ ఇంట్లోనే సమయాన్ని గడుపుతున్నారు . అయితే ఏప్రిల్ 23వ తేదీన మధ్యాహ్నం సమయంలో పిల్లలకు భోజనం తినిపించిన కవిత భర్త తో కలిసి టీవీ చూస్తుంది.

 

 

 ఈ క్రమంలోనే వరండాలో చీరతో కట్టిన ఉయ్యాలలో పెద్ద కూతురు స్వర్ణిక   అటూఇటూ ఊగుతూ ఉంది. ఉయ్యాలలో గుండ్రంగా తిరుగుతూ ఆడుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు ఆ చీర సదరు బాలిక మెడకు చుట్టుకొని బిగుసుకుపోయింది . దీంతో ఆ బాలిక  ఆర్తనాదాలు చేసినప్పటికీ టీవీలో లీనమైపోయిన తల్లిదండ్రులకు  ఆ ఆర్తనాదాలు వినిపించ లేదు. దీంతో బాలిక ఊపిరాడక అచేతన స్థితిలో కి వెళ్ళిపోయింది. అటువైపుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి కేకలు వేయడంతో తల్లిదండ్రులు బయటకు వచ్చి అచేతన స్థితిలో ఉన్న కూతురిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కళ్ళముందే విగత జీవిగా  మారడంతో ఆ తల్లిదండ్రులు విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. అటు పోలీసులు కూడా పిల్లల విషయంలో జాగ్రత్తలు వహించాలని ఎప్పుడు పిల్లలను  ఓ కంట కనిపెడుతూ ఉండాలి అంటూ సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: