ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో పది మందికిపైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కూడా పరిశ్రమ నుంచి మరోసారి వాయువులు లీకయ్యాయన్న వార్తలు కూడా కలకలం సృష్టించాయి. అయితే ఈ పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన సీఎస్ నీలం సాహ్ని చేసిన ప్రకటన విశాఖ వాసులను కలవరపరుస్తోంది.

 

 

అదేంటంటే.. విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో స్టెరీన్ గ్యాస్ లీకేజీని పూర్తిగా అరకట్టలేదట.. మరో 48 గంటల వరకూ గ్యాస్ ను అరికట్టడం సాధ్యం కాకపోవచ్చని ఆమె చెప్పారు. అంతే కాదు.. ప్రస్తుతం పరిశ్రమలోని గ్యాస్ ట్యాంకర్ల వద్ద 120 డిగ్రీల సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత ఉందన్న వ్యాఖ్యలు విశాఖ నగరవాసుల్లో కలకలం సృష్టిస్తున్నాయి. అంటే ఇంకా గ్యాస్ లీకేజీ కొనసాగుతూనే ఉందన్నమాట. మరి ఇది విశాఖ వాసులపై ఎలాంటి దుష్ప్రభావం చూపుతుందో అర్థంకాని పరిస్థితి.

 

 

అయితే గ్యాస్ లీకేజీ ఘటనకు బాధ్యులు ఎవరైనా వదిలిపెట్టే సమస్య లేదని, ఎంతటివారైనా సరే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. నిపుణుల బృందం గ్యాస్‌ నియంత్రణ చేస్తోందని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ప్రకటించింది. ట్యాంకర్‌లో ఉన్న రసాయనంలో 60 శాతం పాలిమరైజ్‌ అయ్యిందని, మిగిలిన 40 శాతం కూడా పాలిమరైజ్‌ అవుతుందని, ఇందుకు 48 గంటల సమయం పడుతుందని నిపుణులు వెల్లడించారని ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి చెప్పారు.

 

 

ముందు జాగ్రత్త కోసమే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలను వేరే చోటకు తరలించామని మంత్రి గౌతమ్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 86 కంపెనీలను గుర్తించామని, ఈ కంపెనీల్లో భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తున్నామని మంత్రి గౌతమ్‌రెడ్డి చెప్పారు. పరిశీలన తరువాతే కంపెనీలు పునః ప్రారంభించనున్నామని వివరించారు. నిబంధనలను అతిక్రమిస్తే సహించేది లేదని మంత్రి వార్నింగ్ ఇచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: