కరోనా.. ఇపుడు ప్రతీ వారికి బాగా తెలిసిన పదం అయిపోయింది. కరోనా భయాలు సంగతి పక్కన పెడితే ఆ పదం ఒకసారి అయినా అనకుండా రోజు గడచే సీన్ లేదు. ఇదిలా ఉంటే కరోనా భారత దేశంలో ఏ స్టేజ్ లో ఉంది అన్నది చూస్తే గణాంకాలు మాత్రం కాసింత సేద తీర్చేలా ఉన్నాయి. అయితే ఈ లెక్కలు కావు అసలైన ముప్పు ఇంకా తొలగలేదని అంతా అంటున్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే జర జాగ్రత్త అంటూ భారతీయ పౌరులను  హెచ్చరించారు.

కరోనా విషయంలో ఎవరెన్ని చెప్పినా కూడా భారత్ లాంటి దేశాల్లో దాని ప్రభావం చాలా ఎక్కువగానే ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. యూరోపియన్ దేశాల్లో ఇపుడు కరోనా సెకండ్ వేవ్ మొదలైందని వారు గుర్తు చేస్తున్నారు. భారత్ లో కూడా కరోనా కేసుల తగ్గుదలను చూసి సంబరపడితే మొదటికే మోసం వస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు.

కరోనా కారణంగా దేశంలో ఇప్పటికే 75 లక్షల మంది వ్యాధి బారిన పడిన సంగతి విధితమే. అలాగే లక్ష వరకూ జనం చనిపోయారు. ఇక ఇది ఇంతటితో ఆగుతుందా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన తరుణం ఇదేనని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుచేతనంటే కరోనా ఇపుడు గ్రామాల్లోకి వెళ్ళింది. పైగా పండుగల సీజన్ మొదలైంది. జనాల్లో భయాలు బాగా తగ్గిపోయాయి. ఇక లాక్ డౌన్ ప్రక్రియ మొత్తం ముగిసింది.

ఇవన్నీ కూడా కరోనా మరోసారి వీరవిహారం చేయడానికి దోహదపడే అంశాలేనని అంటున్నారు. ఈ డిసెంబర్లో వింటర్ సీజన్ మొదలవుతుందని, ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయని, అది కరోనాకు కలసివచ్చే కాలమని అంటున్నారు. ఏ మాత్రం జాగ్రత్త వహించకపోయినా సెకండ్ వేవ్ తో భారత్ డేంజర్ లో పడడం ఖాయమని కూడా స్పష్టం చేస్తున్నారు. చూడాలి మరి. ఏది ఏమైనా వ్యాక్సిన్ వచ్చేంతవరకూ భయంగానే బతకాలని అంతా సూచిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: