రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ రైతు భరోసా సాయాన్ని అందిస్తోంది. 2019 అక్టోబర్‌ 15న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500లను అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి అందించాలనేది ప్రభుత్వ సంకల్పం. అయితే తొలి దశలో అందరికీ రైతు భరోసా అందినా.. తర్వాతి కాలంలో కౌలు రైతులకు ప్రభుత్వం మొండిచేయి చూపించిందనే వాదన బలంగా వినపడింది. అయితే ప్రభుత్వం మాత్రం అర్హులైనవారందరికీ సాయం అందిస్తున్నామని, దీనిలో ఎలాంటి తారతమ్యాలు లేవని స్పష్టం చేసింది.
వాస్తవంగా వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ రైతు భరోసా అందించాలన్న లక్ష్యంతో ఎప్పటికప్పుడు వచ్చిన వినతులను పరిష్కరిస్తుండడంతో ఈసారి లబ్ధిదారుల సంఖ్య 50,47,383కి చేరింది. 2019 అక్టోబర్‌లో లబ్ధిదారుల సంఖ్య 46,69,375 మాత్రమే కాగా 2020 మే నెలలో ఖరీఫ్‌ సమయంలో ఈ సంఖ్య 49,45,470కి చేరింది. ఇప్పుడు రబీలో ఏకంగా 50,47,383కి చేరింది. అంటే ఖరీఫ్‌తో పోల్చుకుంటే మరో 1,01,913 మంది కొత్తగా సాయం పొందబోతున్నారనమాట. 50,47,383 మంది లబ్ధిదారులకు గాను ఈసారి రూ.1,114.87 కోట్ల సాయం అందబోతోంది.

రబీ సీజన్‌కు గాను భూ యజమానులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకూ రైతు భరోసా అందుతుంది. అయితే కేవైసీ చేయించుకోని రైతులకు ఇంకా భరోసా సొమ్ము అందకుండా పోతోంది. దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా.. రైతులు వెంటనే సచివాలయంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ ని సంప్రదించాలని, లేదా రైతు భరోసా కేంద్రాల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు అధికారులు. బ్యాంక్ అకౌంట్లో సొమ్ము జమకాని వారంతా సచివాలయాలను లేదా రైతు భరోసా కేంద్రాలను సంప్రదిస్తే.. సాంకేతిక సమస్యలను సిబ్బంది పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు. ఈ దఫా ఏ రైతుకి కూడా భరోసా సొమ్ము అందకుండా పోదాని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: