హైదరాబాద్ నగరంలో కురిసిన కుండపోత వర్షానికి కాలనీలు కాలనీలు నీటమునిగాయి. ఇళ్లు కూలిపోయాయి.. ఇంట్లో వస్తువులు కొట్టుకుపోయాయి.. షాపుల్లో సరుకు వర్షార్పణం అయింది. వరద బీభత్సం అంతాఇంతా కాదు. నష్టపోయిన వారికి అండగా నిలిచింది ప్రభుత్వం. నష్టపరిహారం చొప్పున ఒక్కో కుటుంబానికి పది వేల రూపాయలు అందిస్తోంది. అయితే.. పంపిణీ వ్యవహారాన్ని స్థానిక టీఆర్ఎస్ నేతలకు అప్పగించడమే.. పెద్ద తలనొప్పిగా మారింది.

నష్టపరిహారం పంపిణీలో చేతివాటం చూపుతున్నారు లోకల్ లీడర్స్. అర్హులైన వారికి కాకుండా... గాలి లెక్కలు చెప్తూ అడ్డగోలుగా లిస్ట్ తయారు చేసి.. డబ్బులు పక్కదారి పట్టిస్తున్నారు. నీట మునిగిన ప్రాంతాల్లో... నష్టపోయిన కుటుంబాలకు కాకుండా తమ అనుచరులు, కార్యకర్తలు, సన్నిహితుల కుటుంబాలకు మాత్రమే డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు.

ఒక్కో కుటుంబానికి పది వేల రూపాయలు అని ప్రభుత్వం చెప్తుంటే.. పంపిణీ చేస్తోంది మాత్రం 5 వేలు, మూడు వేలు.. రెండు వేలు.. ఇలా అడ్డగోలుగా పంపిణీ చేస్తున్నారు లోకల్ లీడర్స్. 3 వేలు కమీషన్ ఇస్తావా.. అయితే 10 వేలు ఇప్పిస్తా అంటూ కొందరు కక్కుర్తి పడుతున్నారు. లిస్ట్ లో 10 వేలు ఇచ్చినట్టు రాసి.. 5 వేలు ఇచ్చి 5వేలు కార్యకర్తలు నొక్కేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నగరంలో ఎక్కడ చూసినా... నష్టపరిహారం అందని వారి ఆక్రోశం, ఆందోళనలు, ఆరోపణల వెల్లువే. కూకట్ పల్లి లో ఏకంగా రాళ్లు, బీర్ బాటిళ్లు, కర్రలతో దాడులు చేసుకునే దాకా వెళ్ళింది పంపిణీ వ్యవహారం. పరిహారం అందని బాధిత కుటుంబాలు రోడ్డెక్కారు.. ధర్నా చేశారు. అందులో బాధిత కుటుంబాల యువకులు కూడా పాల్గొన్నారు. ఎవరైతే ధర్నా చేసారో.. ఆ యువకులను కాపుకాసి అర్ధరాత్రి దారుణంగా కొట్టారు.  స్థానిక టీఆర్ఎస్ నేతలే ఈ దాడి చేశారని ఆరోపిస్తున్నారు యువకులు.

నగరంలో ఏ ఏరియా చూసినా...  పరిహారం పంపిణీ ఆందోళనలే. బాధిత కుటుంబాలకు సాయం చేసి అండగా నిలుద్దామన్న ప్రభుత్వ ఆలోచన...స్థానిక నేతల జోక్యం, కమీషన్ రాయుళ్ల చేతివాటంతో పక్కదారి పడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: