అదేదో సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటాడు. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా అని. మరి పొలిటికల్ గా కూడా పవన్ అదే రూట్ ని ఫాలో అవుతున్నట్లుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి సై అని చివరి నిముషంలో డ్రాప్ అయింది. బీజేపీతో జనసేనకు పొత్తు కారణంగా తాము పోటీ నుంచి విరమించుకుంటున్నట్లుగా పవన్ ప్రకటించారు. ఇదిలా ఉంటే పవన్ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తారని బీజేపీ పెద్దలు ప్రకటించారు.

పవన్ ఇపుడు ఢిల్లీ టూరులో ఉన్నారు. ఆయన రెండు మూడు రోజుల్లో ఢిల్లీ టూర్ నుంచి హైదరాబాద్ వస్తారని అంటున్నారు. బీజేపీకి ఇచ్చిన మాట ప్రకారం పవన్ గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేస్తారని చెబుతున్నారు. డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ఉంది. దానికి ఒక రోజు ముందు నవంబర్ 30న ప్రచారం చేయకూడదు.  అంటే ఇక మిగిలిన రోజులు ఈ నెల 29 వరకూ అన్న మాట. అక్కడితో ప్రచారానికి సమాప్తం అన్నమాట.

గ్రేటర్ ఎన్నికలలో ఈ నెల 28, 29 తేదీలలో బీజేపీ తరఫున పవన్ ప్రచారం చేస్తారని అంటున్నారు. అంటే లాస్ట్ డేస్ లో పవన్ ప్రచారానికి వస్తారన్న మాట. అది కచ్చితంగా బీజేపీకి ఊపు తెచ్చేదిగానే ఉంటుంది. ఎందుకంటే అందరి ప్రసంగాలు విని విని విసుగెత్తిన ఓటర్లకు పవన్ లాంటి చరిష్మాటిక్ లీడర్, సిని హీరో  ప్రచారం చేస్తే ఆ కిక్కే వేరు అంటున్నారు. ఇక లాస్ట్ పంచులు కూడా పవన్ మార్క్ వి ఉంటాయని అంటున్నారు.

ఇక టాలీవుడ్ ఇప్పటికే కేసీయార్ కి టీయారెస్ కి అనధికారికంగా మద్దతు ఇస్తోంది. ఇక పవన్ బ్రదర్ మెగాస్టార్ అయితే కేసీయార్ ని ఈ మధ్యనే కలసి మళ్ళీ సినీ సమస్యల మీద చర్చించారు. ఈ సమయంలో భేటీ అంటే అది కచ్చితంగా టీయారెస్ మార్క్  ఎన్నికల స్టంట్ అని విపక్షాలు విమర్శలు చేశాయి కూడా. మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీ ఓ వైపు ఉంటే పవన్ మాత్రం బీజేపీకి ప్రచారం నిర్వహించడం అంటే సాహసమే అనుకోవాలి. కానీ పవన్ రాజకీయ పార్టీ అధినేతగా ప్రచారం చేస్తారు కాబట్టి ఫరవాలేదు అంటున్నారు. చూడాలి మరి పవన్ తొలిసారిగా కేసీయార్ సర్కార్ మీద విమర్శలు చేస్తారా అన్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: