ఆంధ్రప్రదేశ్ సహా అన్ని ఇతర రాష్ట్రాలకు కొవిడ్ వ్యాక్సిన్ లు సరఫరా అయ్యాయి. బుధవారం వీటిని జిల్లా కేంద్రాలకు సరఫరా చేశారు. అయితే జిల్లాలన్నిటికీ సమంగా వీటిని పంపిణీ చేయలేదు. ఒక్కో జిల్లాకు ఒక్కో పరిమాణంలో కొవిడ్ వ్యాక్సిన్లు సరఫరా చేశారు. మొత్తం 4,77,000 వ్యాక్సిన్లను జిల్లా కేంద్రాలకు పంపించారు అధికారులు. వీటిలో అత్యథికంగా తూర్పుగోదావరి జిల్లాకు 38,128 వ్యాక్సిన్ లు పంపిణీ చేయగా.. అత్యల్పంగా విజయనగరం జిల్లాకు 17,465 టీకాలు పంపించారు.

ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా వ్యాక్సిన్ల పంపిణీ చేపట్టాలని భావించినా, తొలి విడతలో.. ఎక్కువగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే టీకాలు ఇవ్వబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 332 వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వంద మందికిపైగా సిబ్బంది ఉంటేనే కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నారు. టీకా వేయడానికి అర్హుల ఎంపిక బాధ్యతను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు అప్పగించారు. కొవిషీల్డ్‌ టీకా కేసుల్లో ఒక్కోదానిలో 10 డోసులు ఉంటాయి. ఒక్కసారి ఈ కేస్ ఓపెన్ చేస్తే.. దాన్ని 4 గంటల లోపు వినియోగించాల్సి ఉంటుంది. అంటే 10 డోసులున్న టీకా కేస్ ని ఓపెన్ చేసేలోపు 10మంది లబ్ధిదారుల్ని ఒకచోటకు చేర్చాల్సి ఉంటుంది. 10మంది ఉన్నారు అనుకున్నప్పుడే టీకా కేస్ ఓపెన్ చేసి దాన్ని వినియోగిస్తారు.

ఈనెల 16వ తేదీన ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు అర్హులకు వ్యాక్సినేషన్ చేస్తారు. తొలి విడతలో ఈ నెల 16 నుంచి కొవిషీల్డ్‌ టీకా మాత్రమే అందుబాటులో ఉంటుంది. భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాక్సిన్ వ్యాక్సిన్ల సంఖ్య తక్కువగా ఉన్నందున, వాటిని వెంటనే వినియోగించరు. టీకా నిల్వ విషయంలో కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనుమతించిన శీతల పరిస్థితుల్లో దాన్ని నిల్వచేయాల్సి ఉంటుంది. దీనికోసం కూలింగ్ బాక్స్ లు అన్ని కేంద్రాలకు సరఫరా చేశారు. అదే సమయంలో విద్యుత్ అవాంతరాలు లేకుండా చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: