మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అవుతారని కొద్ది రోజుల క్రితం వరకు ప్రచారం జరిగినా ఆఖరుకు తుస్సుమన్నట్లయింది. రేవంత్ పేరు రాగానే రాజకీయంగానూ,  ప్రజల్లోనూ జోష్ పెరిగింది. జానారెడ్డి రంగంలోకి దిగి నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పూర్తయ్యేంతవరకు ఈ ప్రక్రియ ఆపాలని కోరడంతో టీపీసీసీ చీఫ్ ఎంపిక మరోసారి వాయిదా పడింది. ఈ ప్రక్రియ వాయిదా పడటంతో రేవంత్ రెడ్డి వర్గం తీవ్ర నిరాశకు గురైందనే టాక్ వినిపిస్తోంది. కొత్త ఏడాదిలో రేవంత్ రెడ్డి కచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ బాస్ అవుతారని.. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు తీసుకొస్తారని ఆయన వర్గం నాయకులు భావించారు.

             తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ.. రేవంత్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. అయితే రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఇస్తే.. తనతో పాటు అనేక మంది నేతలు పార్టీని వీడే అవకాశం ఉందని వీహెచ్ వంటి సీనియర్ నేతలు బాహాటంగానే తమ వ్యతిరేకతను వెల్లడించారరు. జానారెడ్డి సూచనతో కాంగ్రెస్ హైకమాండ్ ఈ మొత్తం ప్రక్రియను కొంతకాలంపాటు కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టేసింది.


                            తనకు టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వకున్నా.. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని బహిరంగంగానే రేవంత్ విజ్ఞప్తి చేశారు. టీపీసీసీ చీఫ్ పదవి ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదని పార్టీ పట్ల తనకున్న చిత్తశుద్దిని చాటారు. అయినా కాంగ్రెస్ హైకమాండ్ మరోసారి ఈ ప్రక్రియను పక్కనపెట్టడం రేవంత్ రెడ్డి వర్గీయులు ఉసూరుమన్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో బీజేపీ జాతీయ నాయకత్వం జోష్ పెంచుకుంటూ పోతుంటుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయంలో అంత వేగంగా ముందుకు సాగలేకపోతోందనే భావన ప్రజల్లోనూ వస్తున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతే ఒకసారిగా ఏ నిర్ణయం తీసుకోలేదు.. అన్ని నాన్చుతూ ఉంటుంది అనుకుంటున్నారట జనాలు. ఏదిఏమైనా కాంగ్రెస్ లో అంతో కొంతో ఉత్సాహం నింపేందుకు రేవంత్ వంటి నాయకులు ఉన్నప్పటికీ గ్రూపు రాజకీయాల వల్ల కాంగ్రెస్ ఏమీ సాధించలేకపోతుందనే విమర్శలకు ఇటువంటి తాత్సరం పనులు బలాన్నిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: