న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ను ఎన్నో రోజులనుంచి పట్టి పీడిస్తున్న సమస్య పార్టీ అధ్యక్ష పదవి. ఈ పదవిలో కూర్చోవడానికి సోనియా గాంధీకి వయసైపోయింది. రాహుల్ గాంధీకేమో ఇష్టం లేదు. ఇక ప్రియాంకా గాంధీ పదవికి దూరంగా ఉంటున్నారు. దీంతో పదవిని కాపాడుకోవడానికి, ఆ పదవి తమ కుటుంబం చేతుల్లోనే ఉండడానికి సోనియా గాంధీ నానా తంటాలు పడుతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా పదవి వేరేవారికి వెళ్లిపోతుందేమోననే అంటిపెట్టుకుని ఉంటున్నారు. ఎలాగైనా యువరాజు రాహుల్ గాంధీని ఆ పదవిలో కూర్చోబెట్టాలని ఆమె భావిస్తున్నారు. ఈ విషయంపైనే ఈ నెల 22న జరిగే వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

ఈనెల 22వ తేదీ(శుక్రవారం) కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో రాజకీయ పరిణామాలపై చర్చించడంతో పాటు పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌‌ను నిర్ణయించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక తేదీని నిర్ణయంచే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాల ద్వారా తెలుస్తోంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశం జరుగనుందని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి వారంరోజుల ముందు ఈ సమావేశం నిర్వహించడం కీలక పరిణామమని వారు చెబుతున్నారు. పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

రైతుల ఆందోళన, అర్ణాబ్ చాట్ లీక్‌ల వ్యవహారంపై కూడా సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చిస్తారట. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనపై ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించే వీలుంది. ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమేనని కాంగ్రెస్ సెంట్రల్ అధారిటీ ఒక నోట్‌ను పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి సమర్పించిందని, ఆ తర్వాతే సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడిగా తిరిగి రాహుల్ పదవీ బాధ్యతలు చేపడతారా..? లేక వేరే వారికి పదవిని అప్పగిస్తారా..? అదీ కాకుంటే సోనియానే మళ్లీ పదవీ బాధ్యతలను స్వీకరిస్తారా..? అనేది మరో రెండు రోజుల్లో తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: