పంచాయతీ ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం మెడలు వచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సంబంధించిన కీలక విషయం వెలుగు చూసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డకు ఏపీలో ఓటే లేదు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి వివరాలు చెప్పిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తనకు ఏపీలో ఓటు హక్కు లేని విషయాన్ని తెలిపారు.


        తనకు హైదరాబాద్‌లో ఓటు హక్కు ఉండేదని, దాన్ని సరెండర్ చేసి తాను పుట్టి పెరిగిన చదువుకున్న ఊరు గుంటూరు జిల్లా దుగ్గిరాలలో దరఖాస్తు చేసుకున్నట్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. అయితే, తనకు ఓటు హక్కు రాలేదన్నారు. తాను దుగ్గిరాలలోనే ఉంటున్నా కూడా తాను అక్కడ ఉండడం లేదనే కారణంతో తనకు ఓటు హక్కు ఇవ్వలేదన్నారు. తాను దుగ్గిరాల స్కూల్లోనే చదువుకున్నానని, అక్కడే ఆస్తులు కూడా ఉన్నాయని చెప్పారు. ఓటరు కార్డు అంశంపై ఓ సారి తమ వద్ద హాజరుకావాలని స్థానిక తహసీల్దార్ కోరారని, ఆ సమయంలో చీఫ్ సెక్రటరీతో సమావేశం కారణంగా హాజరుకాలేకపోయానన్నారు. మరో రోజు తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరినా పట్టించుకోలేదన్నారు. ఈ విషయంపై తాను కలెక్టర్‌ను కలసి విజ్ఞప్తి చేస్తానన్న ఎస్ఈసీ.. అవసరం అయితే కోర్టుకు కూడా వెళ్తానన్నారు. తనకు ఓటు హక్కు కల్పిస్తే తాను కూడా పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేవాడినని నిమ్మగడ్డ చెప్పారు.

       ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఎన్నికల నిర్వహణతో పాటు కోవిడ్ వ్యాక్సినేషన్ పై చర్చించారు. ఏకగ్రీవాలు చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన మీద నిమ్మగడ్డ విమర్శలు గుప్పించారు. ఒకసారి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత ఎన్నికలను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ప్రభావితం చేసేలా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటనపై ప్రజాసంబంధాల శాఖ కమిషనర్‌ను సంజాయిషి అడిగామన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.


మరింత సమాచారం తెలుసుకోండి: