ఓవైపు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలైన సందర్భంలో.. మరోవైపు పరిషత్ ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్నారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. గతంలో పరిషత్ ఏకగ్రీవాలపై ఆయన ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో.. ఆయన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల దాఖలుకు అవరోధాలు, బలవంతపు ఉపసంహరణ విషయంలో అందిన ఫిర్యాదులపై విచారణలను నిలువరిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని ఆయన తన అఫిడవిట్ లో వివరించారు.

ఎన్నికలను నిష్పాక్షికంగా, స్వచ్ఛంగా నిర్వహించేందుకు పరిస్థితుల ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందని ఎస్ఈసీ నిమ్మగడ్డ హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ వేశారు. ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికలను రద్దు చేయడం, వాయిదా వేయడం, తిరిగి నిర్వహించే అధికారం కమిషన్‌ కు ఉందని, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకుంటే జోక్యం చేసుకునే అధికారం ఎస్‌ఈసీకి ఉందని వివరించారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలే రాష్ట్ర ఎన్నికల సంఘానికీ ఉంటాయని, ఎన్నికలను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత కేవలం ఎన్నికల సంఘంపై మాత్రమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ శాఖల అధికారులపైనా ఉంటుందని స్పష్టం చేశారు. రిటర్నింగ్‌ ఆధికారులు ప్రచురించిన తుది జాబితా ప్రకారం.. జడ్పీటీసీలకు 126 మంది అభ్యర్థులు, ఎంపీటీసీలకు 2363 అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారని, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకగ్రీవాల సంఖ్య పెరిగిందని చెప్పారు. ఏకగ్రీవాల విషయంలో బెదిరింపులపై తమకు అందిన ఫిర్యాదుల మేరకే విచారణకు చర్యలు తీసుకున్నామని వివరించారు. వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని పిటిషనర్‌ వేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు. ఏకగ్రీవాలపై విచారణను నిలువరిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని ఎత్తివేయాలన్నారు. బలవంతపు ఏకగ్రీవాల  సంగతి తేల్చితేనే ఆ తర్వాత పరిషత్ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అవుతుందని అన్నారు నిమ్మగడ్డ.

మరింత సమాచారం తెలుసుకోండి: