తెలంగాణలో కరోనా కట్టడికి కేసీఆర్ సర్కారు అనేక చర్యలు చేపట్టింది. ఈటల రాజేందర్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరిగాయి, ఇప్పుడు కాస్త అదుపులోకి వచ్చాయి. హఠాత్తుగా ఈటల పదవినుంచి వైదొలగడం, ఆయనను మంత్రి మండలినుంచి బర్తరఫ్ చేసి, కేసీఆర్ స్వయంగా ఆ శాఖను చేపట్టడం చకచగా జరిగిపోయాయి. కేసీఆర్ వైద్య, ఆరోగ్య శాఖను తీసుకునే సమయంలో స్వయంగా ఆయన కూడా కరోనాతో బాధపడుతున్నారు. అయితే చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు పూర్తి అధికారాలు ఇస్తూ, ప్రత్యేక అధికారిని సమన్వయ కర్తగా నియమిస్తూ కేసీఆర్ పనులు ఆగకుండా చేశారు. కరోనానుంచి కోలుకున్న తర్వాత కరోనా కట్టడి విషయంలో కేసీఆర్ మరింత దూకుడుగా వ్యవహరించారు. కేటీఆర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం, లాక్ డౌన్ విధించడం, ఇంటింటి సర్వే చేపట్టడం.. ఇలా పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలో కరోనా కట్టడికి తనవంతు ప్రయత్నం చేశానని, అయితే తనకు పూర్తిస్థాయిలో సహకారం అందలేదనే విషయాన్ని కూడా ఈటల ఓ సందర్భంలో గుర్తు చేశారు. తనకంటే మెరుగ్గా ఆ శాఖను నిర్వహించేందుకే కేసీఆర్, ఆయన చేతిలోకి తీసుకున్నారంటూ దెప్పి పొడిచారు. ఈటలకు అధికారులు సహకరించారా, లేక ఈటలకు కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం లేకుండా చేశారా అనే విషయాన్ని పక్కనపెడితే.. ఆయన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పటికంటే ఇప్పుడు తెలంగాణలో హడావిడి మరింత పెరిగింది. ముఖ్యంగా కేటీఆర్ రాకతో సమీక్షలు, సమావేశాలు, కార్పొరేట్ సాయాలు అంటూ నిత్యం ఏదో ఒక వార్త హల్ చల్ చేస్తోంది.

కేటీఆర్ ఆధ్వర్యంలో పలు ఫార్మా కంపెనీలు, ఇతర కార్పొరేట్ కంపెనీలు కరోనా యుద్ధానికి తమవంతుగా సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. మరోవైపు ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గా ఉందని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వ చర్యలను కేంద్రం కూడా గుర్తించిందని, కేంద్ర ఆరోగ్య మంత్రి కూడా అభినందించారని గుర్తు చేశారు. 60లక్షల ఇళ్లలో ఇంటింటి సర్వే పూర్తి చేశామని, 2.1 లక్షల మెడికల్ కిట్లు పంపిణీ చేశామని చెప్పారాయన. రాష్ట్రంలో 1.5లక్షల రెమిడిసివిర్ ఇంజెక్షన్లు నిల్వ ఉన్నాయని, వీటిని ఉత్పత్తి చేసే కంపెనీలతో సమన్వయం చేసుకుంటున్నామని వివరించారు. జిల్లాల్లో కొవిడ్ నియంత్రణ చర్యలను స్థానిక మంత్రులు పర్యవేక్షిస్తున్నారని, వారితో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించామని తెలిపారు. వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచేందుకు, వ్యాక్సిన్ లభ్యత కోసం ఉత్పత్తిదారులతో త్వరలో సమావేశం అవుతామని చెప్పారు కేటీఆర్.

మొత్తమ్మీద ఈటల బయటకు వెళ్లిపోయిన తర్వాతే కేటీఆర్ సహా మిగతా నేతలంతా తెలంగాణలో కరోనా కట్టడిపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టారని తెలుస్తోంది. కరోనా నియంత్రణకోసం జరుగుతున్న కార్యకలాపాలన్నీ ఈటల బయటకు వెళ్లిన తర్వాతే తెలంగాణలో జోరందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: