న్యూఢిల్లీ: జాతీయ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతి రోజు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వార్తల్లోకెక్కుతుంటారు. తాజాగా ఢిల్లీ పోలీసులకు సవాల్ విసిరారు. అంతేకాకుండా మోదీపై విమర్శలతో కూడిన ఓ పోస్టర్‌ను షేర్ చేస్తూ తనను కూడా అరెస్ట్ చేయమని ఢిల్లీ పోలీసులను సవాల్ చేశారు. ఇదివరకు ఇదే పోస్టర్‌ను నగరంలో అంటించినందుకు దాదాపు 25 మందిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు పనితీరుపై రాహుల్ ఈ విధంగా స్పందించారు. పోలీసు శాఖ అంటే ప్రజలకు సేవ చేయాలని, నేతల బంటులుగా ఉండకూదని రాహుల్ అన్నారు.

ఈ మేరకు రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో మోదీ పోస్టర్‌ను షేర్ చేశారు. అదే పోస్ట్‌లోని ఫోటోపై మోదీగారు మన పిల్లల టీకాలను విదేశాలకు ఎందుకు పంపించారని రాసి ఉంది. ఈ ఫోటోను షేర్ చేస్తూ ప్రస్తుతం దేశంలో ఉన్న వ్యాక్సిన్ కొరతను మరోమారు గుర్తుచేశారు. దేశంలో వ్యాక్సినేషన్ పేరుకు మాత్రమే జరుగుతుందని, నిజంగా టీకా అవసరం ఉన్నవారికి అది అందని ద్రాక్ష పండయిపోయిందని ఆయన విమర్శించారు. అందుబాటులో ఉన్న టీకాలు అందరికీ అందడం లేదని, అంతేకాకుండా దేశంలో ప్రాణవాయువు లేక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని, దానిని కూడా కేంద్రం ఎదుర్కోలేక పోతుందని రాహుల్ అన్నారు.

అయితే దేశంలోని రక్షణ శాఖను మోదీ తొత్తుగా వాడుకుంటున్నారని, అందుకనే మోదీకి వ్యతిరేకంగా ఎవ్వరు నోరెత్తినా వారిపై పోలీసులు పంజా విసురుతున్నారని రాహుల్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ వారు కూడా ఈ ఫోటోను తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఈ పోస్టర్ పూర్తి వ్యవస్థను కుదిపేస్తుందంటూ రాసుకొచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే దేశం ఓ నియంత చేతుల్లో ఉన్నట్లు అనిపిస్తుందని, తమ పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకోవడమే ప్రధమ లక్ష్యంగా కాకుండా, దేశంలో ఉన్న మహమ్మారిని అరికట్టేందుకు ప్రయత్నించాలని సూచిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రతి పక్షాలు ఖండిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: