ప్రస్తుతం పశ్చిమబెంగాల్ లో రాజకీయ పరిణామాలు రోజు రోజుకీ వేగంగా మార్పు చెందుతున్నాయి. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గెలుపుపై ముందు నుండి గట్టి నమ్మకాన్ని పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ, ఆ దిశగా అన్ని ప్రయత్నాలను చేసింది. ఇందులో భాగంగానే అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నుండి కొంతమంది ప్రధాన నాయకులు బీజేపీ కండువా కప్పుకున్నారు. వారిలో రాజీవ్ బెనర్జీ, సోనాలి గుహ, దీపేందు బిశ్వాస్, సరళ ముర్ము, ముకుల్ రాయ్ ఉన్నారు. కానీ అందరి అంచనాలను తల క్రిందులు చేస్తూ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారాన్ని మళ్ళీ చేజిక్కించుకుంది. ఈ ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేని భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్ అధికార పార్టీ నాయకులపై కక్ష సాధింపు చర్యలను వేగవంతం చేశారు, ఇందులో భాగంగానే ఒక కుంభకోణం కేసులో టీఎంసీ నాయకులను అరెస్ట్ చేశారు.  ఆ తరువాత టీఎంసీ కూడా టీఎంసీ మాజీ నాయకుడు మరియు బీజేపీ లీడర్ అయిన సువేందు అధికారిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.  కొద్ది రోజుల నుండి బీజేపీలోకి వెళ్లిన టీఎంసీ నాయకులు మళ్ళీ తిరిగి సొంతగూటికి రావడానికి ప్రయత్నిస్తున్నారని విషయం తెలిసిందే. 

ఇందులో భాగంగానే నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు ముకుల్ రాయ్ అయన కుమారుడితో కలిసి మమతా బెనర్జీ సమక్షంలో టీఎంసీ లో చేరారు. అంతకు ముందు రోజు బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ నేతృత్వంలో  నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరు కాకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తాయి. ముకుల్ తో పాటుగా రాజీవ్ బెనర్జీ కూడా రాకపోవడం గమనార్హం. అయితే బీజేపీలో ఉండలేకనే పార్టీని వీడినట్లు సమాచారం. కాగా బీజేపీ నాయకుడు సువేందు అధికారి సైతం పార్టీ మీటింగ్ కి ముందు రోజే ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఈయన కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవియా, ధర్మేంద్ర ప్రధాన్, నరేంద్ర సింగ్ తోమర్‌ లను కలిసిన విషయం తెలిసిందే. అదే సమావేశానికి హాజరైన ఇద్దరు బీజేపీ ఎంపీలు అర్జున్ సింగ్ మరియు సౌమిత్రా ఖాన్ సమావేశం అనంతరం ఢిల్లీకి వెళ్లి అక్కడ ఉన్న సువేందు అధికారితో కలిసి ఎంపీ నిశిత ప్రమాణిక్ ను కలిశారు.  ఈ ముగ్గురూ కూడా 2019 ఎన్నికలకు ముందే టీఎంసీ ని వీడి బీజేపీలో చేరారు.  సువేందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, అమిత్ షా మరియు ప్రధాని నరేంద్ర మోడీలను కలిసినట్లుగా తెలిసింది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బీజేపీలోని ఒక ప్రధాన నాయకుడి యొక్క ఢిల్లీ పర్యటన గురించి పార్టీ అధ్యక్షుడికి తెలియకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా దిలీప్ ఘోష్ మీడియా ముఖంగా తెలియచేశారు.

ప్రస్తుతం టీఎంసీ నుండి బీజేపీకి వెళ్లిన సువేందు అధికారి గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. రానున్న రోజుల్లో బీజేపీ తరపున సువేందు అధికారి కీలకమైన పాత్రను పోషించనున్నారా ? లేదా సొంత పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతారా ? అన్న విషయంపై సందేహాలు నెలకొన్నాయి. కాగా ఇప్పుడు టీఎంసీలో అభిషేక్ బెనర్జీ నే పార్టీ యొక్క జాతీయ బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈ పరిణామాల దృష్ట్యా సువేందు అధికారి వెస్ట్ బెంగాల్ లో అతి పెద్ద రాజకీయ పాత్రను పోషించడానికి సమాయత్తం అవుతున్నట్లు వినికిడి. ఆ పాత్ర రాష్ట్ర అసెంబ్లీ ప్రతి పక్ష నాయకుడని ఊహాగానాలు వస్తున్నాయి. ఇందుకోసమే ఢిల్లీ వెళ్లి అక్కడ ఉన్న పెద్ద అధికారులందరి ఆశీర్వాదాలు తీసుకుని వచ్చినట్లుగా సమాచారం. ఇప్పటికే మొన్న జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి సువేందు అధికారి మమతా బెనర్జీపై గెలిచి మంచి ఊపుమీదున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మమతా బెనర్జీకి సువేందు అధికారి రూపంలో ఛాలెంజ్ ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి సువేందు అధికారికి ఇది అత్యంత కష్టపూరితమైన చర్య అని చెప్పవచ్చు. వెస్ట్ బెంగాల్ బీజేపీ లో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుని మమతా బెనర్జీ ని ఎదుర్కోవడానైకి సిద్ధంగా ఉండాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: