ముఖ్యమంత్రి జ'గన్' పై కాపులు 'కత్తి'కట్టారా? కాపు రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి మాట్లాడాలంటున్నారా? ఇందులో భాగంగానే బీసీల్లో లేదా అగ్రవర్ణ పేదలుగా రిజర్వేషన్లు ఇవ్వాలంటూ వరుస సమావేశాలు పెడుతున్నారా? తద్వారా ముఖ్యమంత్రిపై యుద్ధానికి సిద్ధం కండి అంటూ పిలుపునివ్వడం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలే కారణమా? అసలు కాపు రిజర్వేషన్ల విషయంలో రెండున్నరేళ్లుగా సైలెంట్ అయిన నేతలు ఇప్పుడు ఎందుకు సీఎం జగన్ విషయంలో వైలెంట్ అవుతున్నారు? జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో సందర్భంగా కాపు రిజర్వేషన్లు తన పరిధిలోనివి కాదని కేంద్రంతో పోరాటం చేసి సాధించుకోండని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు అదే కేంద్రం అగ్రవర్ణ పేదలకు ఇచ్చిన రిజర్వేషన్లపై స్వేచ్ఛను రాష్ట్రాలకు ఇచ్చింది. దీన్ని ఉపయోగించుకుని గత టీడీపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీలో 5 శాతం రిజర్వేషన్ ప్రత్యేకిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దాన్ని అమలు చేసే లోగా ప్రభుత్వం మారిపోవడంతో వైసీపీ ప్రభుత్వం అవకాశం ఉన్నా.. కాపు రిజర్వేషన్‌ను పక్కన పెట్టేసింది. ఈ ఒక్క నిర్ణయంతో కాపుల పట్ల ముఖ్యమంత్రికి ఎంత చిత్తశుద్ది ఉందో అర్థం అవుతోందంటున్నారు కాపు సంఘ నేతలు. ముఖమంత్రికి ఏ మాత్రం జ్జానం ఉన్నా.. తక్షణం బీసీల్లో, అగ్రవర్ణ పేదల్లో రెంటిలో ఒక దానిలో కాపులకు రిజర్వేషన్లు కేటాయించాలనే డిమాండు వారు వినిపిస్తున్నారు. ఇకనైనా కాపులకు రిజర్వేషన్లు అమలు చేయకపోతే కాపుల కోపానికి ఈ ప్రభుత్వం మరోసారి అధికార పీఠాన్ని తాకే అవకాశమే ఉండదంటున్నారు.

నిజానికి బ్రిటిష్ ప్రభుత్వంలోనే కాపులు బీసీల్లో ఉండేవారు అయితే బ్రహ్మానంద రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కాపుల రిజర్వేషన్లు రద్దు చేశారు. అయితే చెన్నారెడ్డి, విజయభాస్కర రెడ్డిలు వాటిని పునరుద్ధరించినా న్యాయ వివాదాల్లో చిక్కుకోవడంతో అది సాకారం కాలేదని కాపు నేతలు అంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానని హమీ ఇచ్చి ముస్లింలు, ఇతర కులాలను మాత్రమే బీసీల్లో చేర్చారన్నారు. అయితే తమిళనాడు, కర్ణాటక, రాజస్ధాన్ వంటి రాష్ట్రాల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉన్నాయని ఏపీలో కూడా అలా చేయాలనే డిమాండు వినిపిస్తుందన్నారు. అవసరం అయితే మంజునాథ కమీషన్ రిపోర్టును సుప్రీంకోర్టు ముందు ఉంచి కాపులకు న్యాయం చేయాలని అంటున్నారు.

మరోవైపు కాపులకు రిజర్వేషన్లు కోసం ముద్రగడ పద్మనాభం నిర్వహించిన ఉద్యమంలో దురదృష్టవశాత్తు రైలు దగ్ధం కావడం కాపు ఉద్యమం కాస్త స్తబ్దుగా మారిందంటున్నారు. అయితే ఇప్పుడు కేంద్రమే అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు విషయంలో స్వేచ్ఛ రాష్ట్రాలకు ఇచ్చేయడంతో సీఎం తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని అంటున్నారు. కరోనా కారణంగా రెండున్నరేళ్లు ఎదురు చూశామని ఇక ఓపిక నశించిందన్న వారు ఇక ముఖ్యమంత్రిపై యుద్దమే అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని లేఖల ద్వారా తెలియజేశామని అయితే సమాధానం లేదని అన్నారు. అయినా ప్రజాస్వామ్యయుతంగా నియోజకవర్గానికి వెయ్యి ఉత్తరాలు చప్పున ముఖ్యమంత్రికి కాపు రిజర్వేషన్లపై పోస్టు కార్డులు రాయాలని నిర్ణయించారు. అయితే ఈ ఉత్తరాల్లో గతంలోలా అభ్యర్థనలు కాకుండా హెచ్చరికలు జారీ చేయాలని నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: