హుజురాబాద్‌ ఉపఎన్నిక సమయంలో దళిత బంధు పథకాన్ని ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన తర్వాత తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. ముఖ్యంగా హుజురాబాద్‌ ఉపఎన్నికలో లబ్ధి పొందేందుకు.. తాజా పరిణామాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. నిజానికి ద‌ళిత బంధును ఉప ఎన్నిక‌ స‌మ‌యంలో ఆపేయాల‌ంటూ కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ప్రకటన. .బీజేపీ, టీఆర్‌ఎస్‌లో  మాట‌ల మంట‌లు రాజేసింది. హుజురాబాద్‌లో బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు ఒక‌రిపై ఒక‌రు దాడులు చేసుకునే వ‌ర‌కు వెళ్లింది. దళిత బంధును ఆపింది మీరంటే మీరని  తీవ్ర విమర్శలు  చేసుకున్నారు. ఇది కేసీఆర్ కుట్ర అని మాజీ మంత్రి ఈటల ఆరోపించగా.. ద‌ళిత ద్రోహి అంటూ రాజేందర్‌కు  టీఆర్ఎస్ నేత‌లు కౌంట‌ర్ ఇచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు నెలల క్రితం హుజురాబాద్‌లో పైల‌ట్ ప్రాజెక్టు కింద ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ప్రతి  ద‌ళిత కుటుంబానికి రూ. 9.90 లక్షలు వారి అకౌంట్ల‌లో వేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ ప‌థ‌కం కేవ‌లం ఎన్నిక‌ల స్టంట్ అని ప్రతిప‌క్ష పార్టీలు ఆరోపించాయి. రాష్ట్రం మొత్తం దళిత బంధును  అమలు చేయాలని  డిమాండ్ చేశాయి. దీంతో మ‌రో నాలుగు మండ‌లాల్లో ఈ ప‌థ‌కాన్ని  కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది. హుజురాబాద్ ఎన్నికపై ద‌ళిత బంధు ప‌థ‌కం ప్రభావం చూపుతుంద‌ని గ‌తంలో సెంట‌ర్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ ఫోర‌మ్ కన్వీనర్ పద్మనాభ రెడ్డి కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాశారు. అయితే లేఖ రాసిన రెండు నెల‌ల త‌ర్వాత.. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న స‌మ‌యంలో.. ద‌ళిత బంధు ఆపాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

దళిత బంధును ఆపాలన్న ప్రకటన తర్వాత బీజేపీ,టీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. దళిత బంధుపై బీజేపీ కుట్ర చేసిందని టీఆర్‌ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. దళితుల పట్ల వ్యతిరేకతను బీజేపీ మరోసారి బయట పెట్టుకుందని ఫైర్ అవుతున్నారు. హుజురాబాద్‌లో మోదీ, ఈటల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. మరోవైపు ద‌ళిత బంధు ప‌థ‌కం ఆగిపోవ‌డానికి కేసీఆరే కార‌ణం అని బీజేపీ నాయకులు కూడా మండి పడుతుండగా... బీజేపీ నేత‌ల ఫిర్యాదు వ‌ల్లే ద‌ళితుల‌కు అన్యాయం జ‌రుగుతోందని టీఆర్ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంమీద పది రోజులుగా ప్రశాంతంగా సాగుతున్న ప్రచారంలో దళిత బంధు నిలిపివేత ప్రకటన అగ్గి రాజేసింది. ఇది మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: