దేశం గ‌ర్వించ‌ద‌గ్గ తెలంగాణ సాయుధ పోరాట వీరుడు కుమ్రంభీమ్  పుట్టి నేటికి 121 ఏండ్లు. 1901 అక్టోబ‌ర్ 22న జ‌న్మించాడు.  ఆదివాసీలు త‌మ ఆచారాల ప్ర‌కారం ఆయ‌న జ‌యంతిని వారం రోజుల పాటు నిర్వ‌హిస్తారు. అక్టోబ‌ర్ 27న ఆయ‌న వ‌ర్థంతి. ప్ర‌తిఏటా ఆశ్వ‌యుజ మాసం శుద్ధ‌పౌర్ణ‌మి నుంచి ఆన‌వాయితీగా వ‌ర్థంతి జ‌రుపుకుంటారు. కుమ్రంభీమ్ లాంటి అమ‌రుల చ‌రిత్ర అజ్ఞాతంలో ఉండిపోవ‌డం బాధ‌క‌రం. ఇలాంటి వారి జీవితాలు భావిత‌రాలకు పాఠాలు కావ‌డానికి నోచుకోవ‌డం లేదు. వాస్త‌వ ప‌రిస్థితుల ఆధారంగా అట్ట‌డుగు వ‌ర్గాల చ‌రిత్ర‌, జీవ‌న విధానం, సంస్కృతుల‌ను తెర‌కెక్కించిన సంద‌ర్భాలు చాలా అరుదుగా క‌నిపిస్తుంటాయి.  

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని గోండు గిరిజ‌నుల ప్రత్యేక సంస్కృతి సంప్ర‌దాయాల‌ను ఆవిష్క‌రిస్తూ, అడ‌వి బిడ్డ‌ల హ‌క్కులైన జ‌ల్-జంగ‌ల్‌-జ‌మీన్  అన‌గా నీరు అడ‌వి భూమి కోసం ప్రాణాలు అర్పించిన ఆదివాసి యోధుడు కుమ్రం భీమ్ పోరాట క‌థ‌ను 1990లో తెర‌కెక్కించారు. 1991లో నంది అవార్డును సొంతం చేసుకున్న ఆ చ‌రిత్రాత్మ‌క చిత్రం రెండు ద‌శాబ్దాల త‌రువాత  విడుద‌ల అయింది. తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో 2010 జులై 02న విడుద‌లైంది. కుమ్రంభీమ్ వాస్త‌వ ఉద్య‌మంలో కొన్ని ప్ర‌ధాన ఘ‌ట్టాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆదివాసిల స్వ‌యం పాల‌న నినాదంతో ప‌దేళ్ల‌కు పైగా 1928 నుంచి 1940 వ‌ర‌కు కొన‌సాగిన జోడేఘాట్ తిరుగుబాటు మ‌హోజ్వ‌ల‌ చ‌రిత్రగా నిలిచింది.

ఇంగ్లాండు నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన ఆంథ్రాపాల‌జిస్ట్ ప్రొఫెస‌ర్ హైమ‌న్ డార్ప్ ఆదిలాబాద్ ఏజెన్సీలో నివ‌సిస్తున్న గోండు, కొలాం, కోయ‌, ప‌ర్థాన్‌, నాయ‌క‌పోడు గిరిజ‌నుల‌తో మ‌మేక‌మై ప‌రిశోధ‌నలు చేప‌ట్టారు. ఆత‌రువాత ఆదివాసుల వీర‌త్వం గురించి బాహ్య ప్ర‌పంచానికి తెలిసింది. భీమ్‌దాదా పోరాట ఫ‌లితంగానే అంబేద్క‌ర్ రాజ్యాంగంలో ఆదివాసుల‌కు రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యం క‌ల్పించారు. జోడేఘాట్ గుట్ట‌లో పోరాటానికి కుమ్రం నూరు, వెడ్మ‌రాములు వెన్నుద‌న్నుగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మానికి భీమ్ పోరాట స్ఫూర్తి ఎంతో స‌హ‌క‌రించింది. భీమ్ చిత్రంతో ప్ర‌భుత్వం పోస్ట‌ల్ క‌వ‌ర్ విడుద‌ల చేయ‌డం హ‌ర్ష‌ణీయం. ఇలాంటి ఆద‌ర్శ‌మ‌హ‌నీయుల‌పై తీసే చిత్రాలు ఇటీవ‌ల వాస్త‌వ‌క‌త‌కు భిన్నంగా వివాద‌స్పదంగా మార‌టం ఆక్షేప‌ణీయం. భీమ్ చ‌రిత్ర‌ను, పోరాట నేప‌థ్యాన్ని చ‌రిత్ర‌లో చేర్చాల‌ని ప‌లువురు డిమాండ్ చేస్తున్నారు. కొండ‌ల్లో, కోన‌ల్లో, ప్ర‌కృతితో స‌హ‌జీవ‌నం సాగించి గిరిప్ర‌జ‌లు అడ‌విపై హ‌క్కు, సామాజిక న్యాయం, త‌ర‌త‌రాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల‌కు ప‌ట్టాలు కోరుకుంటున్నారు. హ‌క్కు ప‌త్రాల ఆధారంగా వ్య‌వ‌సాయ రుణాలు అందించి గిరిజ‌న రైతాంగాన్ని ఆదుకోవాల‌ని.. గిరిజ‌న గ్రామాల‌లో మౌలిక వ‌స‌తులు క్ప‌లించి సర్వ‌తోముఖాభివృద్ధికి తోడ్ప‌డాల‌ని కోరుతున్నారు ఆదివాసులు. నేడు కుమ్రంభీమ్ జ‌యంతి. ఇండియా హెరాల్డ్ ఆయ‌న‌కు జ‌యంతి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: