రోజులు గడిచేకొద్దీ కోనసీమ, అమలాపురం అల్లర్లవెనుక అసలు కారణాలు బయటకు వస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అల్లర్లలో చాలాపార్టీల నేతలతో పాటు ప్రభుత్వానికి కూడా బాధ్యతుంది. కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రభుత్వం మార్చటమే అల్లర్లకు కారణమైంది. పైకి విషయం చాలా చిన్నదిగా కనిపిస్తున్నా తెరవెనుక మాత్రం పెద్ద తతంగమే నడిచినట్లు అర్ధమవుతోంది.






ఇంతకీ విషయం ఏమిటంటే అంబేద్కర్ జిల్లా పేరుపెట్టాలని పార్టీల పరంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలందరు డిమాండ్ చేశారు. అయితే అంబేద్కర్ పేరుపెట్టడం నాన్ ఎస్సీ నేతల్లోని చాలామందికి ఇష్టంలేదట. ఎప్పుడైతే ప్రభుత్వం అంబేద్కర్ పేరుపెట్టిందో వెంటనే దానికి వ్యతిరేకంగా నాన్ ఎస్సీ నేతలు ముఖ్యంగా శెట్టిబలిజ, కాపులతో పాటు మరికొన్ని సామాజికవర్గాల్లోని యువత నుండి ఫేస్ బుక్ లో పోస్టులు మొదలయ్యాయి. దాన్ని తట్టుకోలేని ఎస్సీల్లోని కొందరు అంబేద్కర్ పేరుకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిలో కొందరిపై దాడులు చేశారట. అలాగే పోస్టులు పెడుతున్న వారిపై ఎస్సీలు కూడా చాలా అసభ్యంగా పోస్టులు పెట్టారట. శెట్టిబలిజల్లోని కొందరిపై ఎస్సీలు దాడులు చేసిన విషయాన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటున్నారు.






అంటే దాడులు ఎస్సీల వైపునుండే మొదలయ్యాయని అర్ధమవుతోంది. ఇదే సమయంలో అంబేద్కర్ పేరు పెట్టిన విషయంలో అభ్యంతరాలు చెప్పేందుకు ప్రభుత్వం నెలరోజుల గడువిచ్చింది. కొందరు ఈ మెయిళ్ళ ద్వారా అభ్యంతరాలు వ్యక్తంచేశారు. మరికొందరు నేరుగా కలెక్టర్ ను కలిసి అభ్యంతరాలు చెప్పేందుకు ప్రయత్నించారు. ఇలా ప్రయత్నించిన వారిని కలవకుండా మంత్రి విశ్వరూప్, ముమ్మిడివరం ఎంఎల్ఏ పొన్నాడ సతీష్ కలెక్టర్ ను నియంత్రించారట. ఆ విషయం బయటపడటంతోనే అంబేద్కర్ పేరును వ్యతిరేకిస్తున్నవారిలో మంటమొదలైంది.






ఇందులో భాగంగానే ప్రభుత్వంపై తమ నిరసన తెలిపేందుకు నాన్ ఎస్సీల్లోని కొన్ని సామాజికవర్గాలు కలెక్టరేట్ ముందు జమయ్యాయి. కలెక్టర్ ను కలిసేందుకు ప్రయత్నించినవారిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో తోపులాటలు, గొడవలు, లాఠీచార్జీలయ్యాయి. అసలే మంటమీదున్న జనాలు ఆ కోపాన్ని మంత్రి, ఎంఎల్ఏల ఇళ్ళపైన చూపించారు. కాకపోతే ఈ జనాల్లో అసాంఘీకశక్తులు కూడా చేరిపోయి మొత్తం వ్యవహారాన్ని హింసాత్మకంగా మార్చేశాయి. ఇపుడు పరిస్ధితి ప్రశంతంగానే ఉన్నప్పటికీ దాని ఫలితాన్ని అందరు అనుభవించక తప్పటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: