తీవ్ర మేథోమ‌థనం అనంత‌రం  కాంగ్రెస్ పార్టీ చీఫ్ నియామ‌కం విష‌యంలో ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌లు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఢిల్లీలో ఆ పార్టీ సీడ‌బ్ల్యూసీ స‌మావేశ‌మైన విష‌యం తెలిసిందే. మొత్తం అయిదు బృందాలుగా విడిపోయిన నేత‌లు.. కొత్త చీఫ్ కోసం క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టారు. ఈ క‌స‌ర‌త్తు అనంత‌రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీని ఎన్నుకున్నారు. పార్టీ తాత్కాలిక‌ అధ్యక్షురాలిగా సోనియాను ఎంపిక చేసినట్లు ఆజాద్ ప్రకటించారు.

కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియలో తాము ఉండబోమంటూ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మ‌ధ్య‌లోనే వెళ్లిపోయారు. ఇదే స‌మ‌యంలో రాహులే అధ్యక్షుడిగా కొనసాగాలంటూ కొంద‌రు పట్టుబట్టారు. సోనియాగాంధీ, రాహుల్ లేకుండానే కొత్త అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ సంప్రదింపులు జరిపింది.  కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, రణదీప్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్, హరీశ్ రావత్, మీరా కుమార్, అహ్మద్ పటేల్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. పీసీసీ చీఫ్‌లు, ఎంపీలు, సీఎల్పీ నాయకులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శలు సమావేశంలో పాల్గొన్నారు.

పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా ఉన్న ప్రియాంకా గాంధీ మాత్రం సీడ‌బ్ల్యూసీ నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తారని ప్ర‌చారం జ‌రిగింది.  పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగే వరకు ఆయన్ను అధ్యక్షుడిగా నియమించాలని చర్చ జరిగింది. కర్ణాటక‌కు చెందిన మల్లికార్జున ఖర్గే కూడా అధ్యక్ష పదవికి రేసులో ఉన్నట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే, ఈ చ‌ర్చోప‌చ‌ర్చ‌ల అనంత‌రం పార్టీ అధ్యక్ష బాధ్యతలకు రాహుల్ గాంధీ అంగీకరించకపోవడంతో సోనియాకు బాధ్యతలు అప్పగించినట్లు గులాంన‌బీ ఆజాద్‌ తెలిపారు. ఆమె తాత్కాలిక అధ్య‌క్షురాలిగా పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తార‌ని  ఆజాద్ ధీమా వ్య‌క్తం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: