దేశంను ఆర్థిక‌మాంద్యం క‌మ్మేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఒక్కో రంగం ప్ర‌భావితం అవుతోంది. మాంద్యం ముప్పును ఎదుర్కోనున్న తర్వాతి రంగం.. ఆభరణాల పరిశ్రమేనా అనే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి (జీజేసీ) ఈ ప్రశ్నకు అవును అంటున్నది. మార్కెట్‌లో నెలకొన్న మందగమన పరిస్థితులు.. జ్యుయెల్లరీ ఇండస్ట్రీని కమ్ముకుంటున్నాయని, దీనివల్ల నైపుణ్యం ఉన్న ఎంతోమంది స్వర్ణకారులు ఉపాధిని కోల్పోయే వీలుందని జీజేసీ వైస్‌ చైర్మన్‌ శంకర్‌ సేన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను ప్రకటించిన బడ్జెట్‌లో కస్టమ్స్‌ సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారు. ఇక మునుపటి విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) విధానంలో 1 శాతంగా ఉన్న పన్ను భారం.. జీఎస్టీ రాకతో 3 శాతానికి చేరింది. ఈ నేప‌థ్యంలో దిగుమతి బంగారంపై కస్టమ్స్‌ సుంకాన్ని, ఆభరణాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలావుంటే నగల కొనుగోలుకు పాన్‌ కార్డు తప్పనిసరి అన్న నియమాన్ని రూ.5 లక్షలు, ఆపై నుంచి వర్తింపజేయాలని సేన్‌ సర్కార్‌కు విజ్ఞప్తి చేశారు.


కాగా, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్ని రంగాల సవాళ్లను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇప్పటికే కొన్ని రంగాల సమస్యలను పరిష్కరించినట్లు, త్వరలో మిగతా రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు విలేకరులతో చెప్పారు. ఒక్కోక్క రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు, ఆమోదయోగ్యమైన ఏదైన సహాయం అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆర్బీఐ కేటాయించిన రూ.1.76 లక్షల కోట్ల నిధులపై కేంద్రం ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. మరోవైపు 2014 నుంచి ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నదని మంత్రి స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: