వివేకానందుడు.. భారత దేశ యువత నిత్య స్ఫూర్తి ప్రదాత.. బలమే జీవనం.. బలహీనమే మరణం అని యువతకు ధైర్యం నూరిపోసిన మహనీయుడు.. యువత ఇనుప కండలు, ఉక్కు నరాలతో ఉండాలని బోధించిన ధీశాలి. మన యువ‌త‌కు స్ఫూర్తి.. మార్గ నిర్దేశ‌కుడు ఆ స్వామి వివేకానంద‌. ఆయన కొటేషన్లు ఎప్పటికీ యువతకుస్ఫూర్తినిస్తాయి. ధైర్యం కోల్పోయిన సమయంలో ఆయన బోధనలు సాంత్వన చేకూరుస్తాయి. ధైర్యంగా ముందడుగు వేయమంటాయి.


ఇవాళ స్వామి వివేకానంద జయంతి. ఆయన 1863వ సంవ‌త్సరం జనవరి 12 తేదీన  కలకత్తాలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విశ్వనాథ దత్తు, భువనేశ్వరి. నరేంద్రనాథ్‌కు చిన్ననాటి నుంచే ఆధ్యాత్మిక దృక్పథం ఉంది. అదే ఆయన్ను వివేకానందగా మార్చి ప్రపంచానికి అందించింది. తన జీవితాన్ని సేవకు అంకితం చేసిన ఆయన సన్యాసం స్వీకరించి ఆధ్యాత్మిక బాటలో ముందడుగులు వేశారు.


స్వామి వివేకానంద మణించి ఎంత కాలమైనా ఆయ‌న మాటలు మాత్రం తరతరాలకు వన్నె తరగని స్ఫూర్తి మంత్రాలై విరాజిల్లుతునత్నాయి. ఆయ‌న వేసిన అడుగులు యువతకు నిత్య చైత‌న్యాన్ని నింపే అస్త్రాలుగా మారాయి. ఆయన తన జీవిత కాలంలో ఇచ్చిన ప్రతీ సందేశం ఎందరికో   ప్రతికూల ఆలోచనల్ని దూరం చేసి వారిలో ధైర్యాన్ని నింపుతూనే ఉంది. సత్యమే నా దైవం.. విశ్వమే నా దేశం అని సగర్వంగా ప్రకటించిన వ్యక్తి మన వివేకానంద.


ప్రత్యేకించి భారత దేశం గొప్పదనాన్ని, హిందూ ఆధ్యాత్మిక చింతన విశిష్టతనూ ప్రపంచానికి చాటిన మహనీయుడు వివేకానంద. తాను భారతదేశానికి ఎంత చెందుతానో, ప్రపంచానికి కూడా అంతే చెందుతానని చెప్పి విశ్వనరుడిగా మారిన వ్యక్తి వివేకానంద. స్వామి వివేకానంద కేవలం భారతావని కే కాదు.. భూమిపై అవతరించిన ఓ గొప్ప జ్ఞాన కాంతి.  స్వామి వివేకానంద బోధనలు చదివితే.. అసలు నీకు నీవెవరో తెలుస్తుంది. నిరాశ, నిస్పృహలతో ఓటమి అంచుల దాకా వెళ్లినా కూడా.. మీలో వెయ్యి ఏనుగుల బలాన్ని, ధైర్యాన్ని నింపుతాయి ఆయన వాక్కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: