విశాఖపట్నం గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీకైన ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వెంట‌నే అధికార యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. వెంట‌నే వేగంగా స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. బాధితుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని, ఎక్కుడ కూడా ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బందిలేకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. అయితే.. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 3 గంటలకు సంభవించినట్లు అధికారులు గుర్తించారు. యంత్రాల‌ను ప్రారంభిస్తుండ‌గా మంట‌లు వ‌చ్చాయ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. రసాయన వాయువు లీకేజీని అరికట్టేందుకు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ రసాయన వాయువు సుమారు 3 కిలోమీటర్ల మేర వ్యాపించిన‌ట్లు గుర్తించారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒంటిపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస సమస్యలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

 

అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయిన కొందరిని అంబులెన్సుల్లో కేజీహెచ్ ఆస్ప‌త్రిక  త‌ర‌లించారు. అస్వస్థతకు గురైన వారిలో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నారు. ఇందులో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మ‌రింత‌గా పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని ప‌లువురు అంటున్నారు. ఈ ఘ‌ట‌న‌తో భయాందోళనలతో తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ వద్దకు చేరుకుని ఆ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. సైరన్‌లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఘటనాస్థలికి పదుల సంఖ్యలో అంబులెన్సులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పరిసర ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి వేరే ప్రాంతాలకు పోలీసులు తరలిస్తున్నారు. ఈ ఊహించ‌ని ఘ‌ట‌న‌తో స్థానికంగా తీవ్ర భ‌యాన‌క ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: