ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి రోశ‌య్య మృతి చెంద‌డంతో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే తెలంగాణ గాంధీభ‌వ‌న్ కు చేరుకుని రోశ‌య్య పార్థివ దేహానికి నివాళుల‌ర్పించారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి రోశ‌య్య మృత‌దేహాన్ని కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు సంద‌ర్శించేందుకు వీలుగా గాంధీ భ‌వ‌న్ లో ఉంచారు. ఉద‌యం నుంచే ప‌లువురు నేత‌లు గాంధీభ‌వ‌న్‌కు చేరుకుని ఏర్పాట్ల‌ను దగ్గ‌ర ఉండి చూసుకున్నారు.

మాజీ ముఖ్య‌మంత్రి, మాజీ గ‌వ‌ర్న‌ర్ పార్థివ దేహాన్ని గాంధీభ‌వ‌న్‌కు తీసుకురావ‌డంతో ఆ ప్రాంత‌మంతా పెద్ద ఎత్తునా బందోబ‌స్తు నిర్వ‌హించారు. టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి, ప‌లువురు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు గాంధీభ‌వ‌న్‌లో మ‌రొక సారి రోశ‌య్య‌కు నివాళుల‌ర్పించారు.   గాంధీభ‌వ‌న్‌లో రోశ‌య్య‌కు ప‌లువురు నేత‌లు జోహ‌ర్లు జోహ‌ర్లు అంటూ నినాదాలు చేసి.. అనంత‌రం గాంధీభ‌వ‌న్ నుంచి కొంప‌ల్లికి అంతిమ‌యాత్ర ద్వారా రోశ‌య్య పార్థివ‌దేహాన్ని త‌ర‌లించారు.

మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు రోశ‌య్య ఫాంహౌస్‌లో మ‌రికాసేప‌ట్లోనే అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టికే అంత్య‌క్రియ‌ల‌కు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేసారు. తెలంగాణ‌ ప్ర‌భుత్వం లాంఛ‌నీయంగా అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. మ‌రోవైపు ఏపీ త‌రుపున మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి, వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ ఉద‌యం నుంచే రోశ‌య్య పార్థివ‌దేహం వ‌ద్దే ఉన్నారు. అంత్య‌క్రియ‌లు ముగిసేంత వ‌ర‌కు ద‌గ్గ‌రుండి చూసుకుంటారు. కొద్ది సేప‌ట్లోనే ఫాంహౌస్‌కు పార్థివ‌దేహం రానున్న‌ది.  

మరింత సమాచారం తెలుసుకోండి: