కాదు కాదంటున్న, లేదు లేదంటున్న  దేశంలో బొగ్గు సంక్షోభం స్పష్టంగా కనిపిస్తోంది. మూతపడనున్న థర్మల్ ప్లాంట్లు, సగం సామర్ధ్యం తోనే నడుస్తున్న యూనిట్లు, కేటాయింపులు పెంచాలంటూ రాష్ట్రాల వినతులు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ పరంగా ప్రధాన రాష్ట్రమైన పంజాబ్ లో మూడు పవర్ ప్లాంట్లు మూతపడ్డాయి. మిగతావి 50శాతం ఉత్పత్తి సామర్థ్యం తోనే  నడుస్తున్నాయి. ఈనెల 13 వరకు రోజుకు 3 గంటల పాటు కోతలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది. శనివారం పంజాబ్ కు 22 రేఖల బొగ్గు రావాల్సి ఉండగా సగమే అందాయి. ఈ నేపథ్యంలో యూనిట్ కు రూ.11.60 పైసలు వెచ్చించి,1800 మెగావాట్ల విద్యుత్ ను కొనుగోలు చేసింది. దేశంలో బొగ్గు కొరతతో కొన్ని రోజులుగా సెంట్రల్ కోల్  నుంచి కేరళ కోటా కంటే 15 శాతం తక్కువ విద్యుత్ పొందుతోంది.

దీంతో రాష్ట్రంలో నాలుగు ధర్మల్  ప్లాంట్లు మూతపడ్డాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో కోతలు తప్పవని రాష్ట్ర విద్యుత్ మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు బొగ్గు కేటాయింపులు పెంచాలని కర్ణాటక సీఎం బసవరాజ్  బొమ్మై కేంద్రాన్ని కోరారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్, ఒడిశాలోని మహానంది క్షేత్రాల నుంచి తమకు కేటాయింపులు ఉన్నాయని వీటిలో తవ్వకాలకు అనుమతులు  మంజూరు చేయాలని అన్నారు. బొగ్గు కొరత తో దేశంలో విద్యుత్ సంక్షోభం రాబోతోందంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఢిల్లీ,ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు ఈ మేరకు సంకేతాలు పంపిన నేపథ్యంలో స్పందించింది. విద్యుదుత్పత్తి కేంద్రాలకు అవసరమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలోని విద్యుత్ కేంద్రాల్లో 72 లక్షల టన్నుల  బొగ్గు నిల్వలు ఉన్నాయని ఇవి నాలుగు రోజులకు సరిపోతుందా అని తెలిపింది. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు రావని  పేర్కొంది. దేశంలోనే థర్మల్ కేంద్రాలకు రోజు 18.5 లక్షల టన్నుల బొగ్గు కావాల్సి ఉండగా సరఫరా 17.5 లక్షల టన్నులుగా ఉందని చెప్పింది. విద్యుత్ సంక్షోభం ఏర్పడనుందంటూ అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారని  సమాచార లోపం వల్ల ఇలాంటివి తలెత్తాయని కేంద్ర విద్యుత్ శాఖ తెలిపింది. మరోవైపు కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయంటే విద్యుత్ సంక్షోభం రానున్నట్లు కాదని వివరించారు.

 ఆ నిల్వలు కేవలం బ్యాక్ అప్ మాత్రమే. రోజువారి సరఫరా కొనసాగుతూనే ఉంటుందన్నారు. గ్యాస్ సరఫరా కూడా తగ్గదన్నారు. కొద్ది రోజుల్లోనే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది అన్నారు. ఢిల్లీకి ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. అయితే కేంద్రం ప్రకటనపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించారు. కోవిడ్ రెండో దశలో ఆక్సిజన్ సంక్షోభం ఉందని చెబితే కొట్టిపడేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం బొగ్గు పరిస్థితి అంతేనని ఢిల్లీ తీవ్ర సంక్షోభంలో ఉందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: