క‌రోనా మ‌హ‌మ్మారి సెకండ్ వేవ్‌ ప్ర‌స్తుతం భార‌త్‌ను అతలాకుతలం చేస్తోంది.రోజురోజుకు వైర‌స్ తీవ్ర‌త పెరుగుతుండ‌టం, ప‌ట్ణ‌ణాల‌తో పాటు గ్రామీణ ప్రాంతాల‌కు ఇది అత్యంత వేగంగా విస్త‌రించ‌డం ప్ర‌జ‌ల‌ను, ప్ర‌భుత్వాల‌ను వ‌ణికిస్తోంది. దేశంలో ఒక్క రోజులో నాలుగు ల‌క్ష‌లకు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి. దీని కార‌ణంగా మ‌రోసారి అన్నిరంగాలు కుదేలయ్యే ప్ర‌మాదం ముంచుకొస్తోంది. జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్త‌మ‌వుతోంది. కేసుల సంఖ్య‌తో పాటు, మృతుల శాతం కూడా పెరుగుతుండ‌టంతో దీని కట్టడి కోసం అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు త‌మ‌కు సాధ్య‌మైన అన్నిమార్గాల్లోనూ ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు తాత్కాలిక లాక్ డౌన్ ను ప్రకటిస్తే మరికొన్ని రాష్ట్రాలు రాత్రి స‌మ‌యంలో క‌ర్ఫ్యూలు విధించాయి. అయితే వైర‌స్ ప్ర‌మాదం త‌గ్గ‌క‌పోవ‌డంతో ఇప్పుడు మ‌రోసారి ఒక్క‌టొక్కటిక‌గా రాష్ట్రాలు సంపూర్ణ లాక్‌డౌన్ దిశ‌గా అనివార్యంగా అడుగులు వేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే కేరళ ప్రభుత్వం  ఇప్ప‌టికే కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సెకండ్ వేవ్ కేసుల తీవ్రత పెరగడంతో ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. అదే బాటలో గోవా కూడా నాలుగు రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది. కేరళ రాష్ట్రవ్యాప్తంగా మే 8 ఉదయం 6 గంటల నుంచి మే 16 వరకు లాక్ డౌన్ అమల్లో ఉండనుంది. కేరళలో కరోనా పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు సీఎం పినరయి విజయన్ వెల్లడించారు. కేరళలో ఒక్కరోజే 42వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. ఒక్కరోజులోనే 57 మంది మృతి చెందారు.  ఈ నేప‌థ్యంలో కరోనా కట్టడి చేసేందుకు అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నామ‌ని,కోవిడ్  నిబంధనలు పాటించేలా వార్డు స్థాయి కమిటీలను బలోపేతం చేసే దిశగా ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. ఈ  రాష్ట్రంలో ప్రస్తుతం 3,56 ,872 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 5 వేల మంది కరోనా బారిన పడి మరణించారు. దేశంలో అత్యధిక వేగంగా కరోనా విస్తరిస్తున్న 30 జిల్లాల జాబితాలో 10 జిల్లాలతో కేరళ తొలిస్థానంలో ఉంది.

ఇక ప‌ర్యాట‌క ప్రాంతంగా ప్ర‌పంచ‌వ్యాప్త గుర్తింపు పొందిన గోవాలో ఇప్పుడు కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇక్కడ ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు వ‌స్తున్న గణాంకాలు వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 51 శాతానికి పెరిగింది.  ఈ నేప‌థ్యంలో మే 6వ తేదీ సాయంత్రం నుంచి 10వ తేదీ సోమవారం ఉదయం వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ చెప్పారు. అత్యవసర సేవలు, పరిశ్రమలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునిచ్చినట్టు చెప్పారు. అయితే ప్రజారవాణాకు అనుమతి లేదని స్పష్టంచేశారు. హ‌ర్యానా రాష్ట్రంలోనూ ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగానే ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
ఇక చ‌త్తీస్‌ఘ‌ర్‌లోనూ వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉన్న‌ ప‌లు జిల్లాల్లో లాక్‌డౌన్‌ను ఈ నెల 15దాకా పొడిగించ‌నున్నట్టు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. రాజ‌స్తాన్ ముఖ్య‌మంత్రి అశోక్‌గెహ్లోత్ గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల్లో కోవిడ్ మ‌హ‌మ్మారిని అరిక‌ట్టాలంటే దేశవ్యాప్త లాక్‌డౌన్ ఒక్క‌టే మార్గ‌మ‌ని కుండబద్ద‌లు కొట్టారు. లేకుంటే దేశంలో ఆక్సిజ‌న్ కొర‌త‌, బెడ్ల కొర‌త దుర్భ‌రంగా ఉంద‌ని, లాక్‌డౌన్ విధించ‌క‌పోతే వైద్యుల కొర‌త కూడా వ‌స్తుంద‌ని, ప‌రిస్థితి మ‌రింత దిగజారుతుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండ‌గా తెలుగు రాష్ట్రాల్లోనూ ప‌రిస్థితి ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తున్న నేప‌థ్యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో ప్ర‌ధాని ఫోన్ ద్వారా స‌మీక్షించి వివ‌రాలు తెలుసుకున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తంమీద కొంద‌రు ముఖ్య‌మంత్రులు సంపూర్ణ లాక్‌డౌన్‌కు అనుకూలంగా లేక‌పోయిన‌ప్ప‌టికీ ప‌రిస్థితులు మ‌రింత తీవ్ర‌రూపం దాల్చితే అది అనివార్య‌మేన‌న్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: