ఈమధ్య మెగాస్టార్ చిరంజీవి  మీద ఏవేవో విమర్శలు ఎవరికి తోచినట్టుగా వాళ్లు చేస్తున్నారు, ఏదేదో అంటున్నారు.ఎవరో ఎదో అంటే, దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి పనికట్టుకుని మరీ చిరంజీవి మీద ఒక నెగటివ్ సృష్టిస్తున్నారు. అసలు చిరంజీవి అంటే వీళ్ళకేమైనా తెలుసా? "మెగాస్టార్" అంటే అదేదో బిరుదు ఆయనకి అయన ఆపాదించుకున్నది కాదు. సిల్వర్ స్క్రీన్‌పై అనితరసాధ్యమైన నటనతో కోట్లాది ప్రజల హృదయాలను ఆనందడోలికల్లో ముంచెత్తుతుండటం... ఆ సినిమాల ద్వారా వచ్చిన పేరు, డబ్బుతో వేలాదిమందికి సాయం చెయ్యడం... ఇవే చిరంజీవిని మెగాస్టార్‌ని చేశాయి తప్ప అదేదో అప్పుడుకప్పుడు ఇచ్చింది కాదు, వచ్చిందీ కాదు.

అసలు మొదటి సినిమా 'ప్రాణం ఖరీదు'తోటే చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు. ఎందుకంటే అప్పుడే అతనిలో పని పట్ల ఉన్న కసి, అంకితభావం, చేసే పనిలో దీక్ష వెలుగులోకి వచ్చాయి. మొదటి సినిమా నాటికే ఈ ఉన్నతమైన లక్షణాలు ఆయన నరనరానా జీర్ణించుకుని ఉన్నాయి. ఆయనలోని ఈ క్వాలిటీస్ చూసే అతను ఎప్పటికయినా తెలుగు చలనచిత్రసీమని ఏలే మెగాస్టార్ అవుతాడని వెండితెర హాస్యదిగ్గజం అల్లు రామలింగయ్య ముందే గుర్తించి తన అల్లుడిగా చేసేసుకున్నాడు. అల్లుకి ముందే తెలుసు తన అల్లుడు మెగాస్టార్ అని. మరి ఈరోజు ఆ మెగాస్టార్ గురించి ఎవరెవరో ఏవేవో కూతలు కూస్తున్నారు.1995వ సంవత్సరంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ బాబ్జి చనిపోయాడు. అప్పట్లో ఇంత కమ్యూనికేషన్ లేదు కదా... చిరంజీవికి కొంచెం లేటుగా విషయం తెలిసింది. తర్వాత ఏం జరిగిందో నాటి ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు మాటల్లో....

"నేను అప్పుడే నా డ్యూటీ ముగించుకొని ఇంటికొచ్చి భోజనం చేసి పడుకుందామని అనుకున్నాను. అప్పుడే మా ఇంట్లో ఫోన్ మోగింది (ల్యాండ్ లైన్). ఎవరో అనుకోని రిసీవర్ అందుకుంటే.... అవతల టాప్ స్టార్ చిరంజీవి వాయిస్... ప్రభూ, నేను చిరంజీవిని. నీకు బాబ్జి ఇల్లు తెలుసా, ఎక్కడుంటారో తెలుసా? అని చిరంజీవి గారు అడిగారు. నేను తెలుసన్నాను. వెంటనే తన దగ్గరకి రమ్మన్నారు. నేను నా స్కూటర్ వేసుకొని చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాను. స్కూటర్ వాళ్ళింట్లో వదిలేసి, చిరంజీవి గారు నన్ను తన కారు ఎక్కించుకొని బాబ్జి ఇంటికి వెళదాం పద అన్నారు. నేను తోవ చూపిస్తుంటే బాబ్జి ఇంటికి వెళ్ళాము. చిరంజీవి గారు తనతో తెచ్చిన 50 వేల రూపాయలు బాబ్జి కుటుంబానికి అందజేసి, సైలెంట్‌గా మళ్ళీ వెనక్కి వచ్చేసి, ఇంటికి పోదాం పద అన్నారు". ఇదొక్కటే కాదు, సీతాఫల్ మండి దగ్గర ఇంకో ఫోటోగ్రాఫర్ ఇంటికి కూడా ఆ ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి మరీ సాయం చేశాడు చిరంజీవి. ఇవి బయట ఎవరికీ తెలియవు. అయన కూడా ఎవరికో తెలియాలని ఇవన్నీ చెయ్యలేదు. ఇలాంటివి ఎన్నో చేశాడు. చెప్పాలంటే కోకొల్లలు. కానీ ఎదో ప్రచారం కోసమో, మరి దేని కోసమో ఇవేవీ చెయ్యలేదు అయన. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలన్నది అయన గుణం. అందుకు కదా అయన మెగాస్టార్ అయ్యాడు. మరి అలాంటి సహృదయుడి మీద ఎందుకిలా బురదజల్లే ప్రయత్నం చేస్తారు? కానీ, చిరంజీవి మాత్రం ఇవేమీ పట్టించుకోక ఎప్పటిలాగే తన మానవీయతను చాటుకుంటూనే ఉన్నాడు. నటులు, అభిమానులు, జర్నలిస్ట్‌లు, ఒకరేంటి సినిమా పరిశ్రమతో సంబంధం వున్న వాళ్లందరికీ అయన సాయం చేస్తూనే వున్నాడు. ఈ మధ్య ఈనాడు ఫోటోగ్రాఫర్ ఒకరికి స్ట్రోక్ వచ్చింది. ఒక మిత్రుడు వెంటనే చిరంజీవికి ఫోన్ చేసి ఆ ఫోటోగ్రాఫర్ పేరు చెప్పి సమాచారం ఇచ్చాడు. చిరంజీవి వెంటనే సదరు ఆ ఫోటోగ్రాఫర్‌ని అపోలో హాస్పిటల్‌లో చేర్పించి, అక్కడి డాక్టర్స్‌తో మాట్లాడి, సరైన వైద్యం ఇప్పించటమే కాకుండా... గంట గంటకి అతని ఆరోగ్యం గురించి తెలుసుకుంటూనే వున్నాడు. ఆ ఫొటోగ్రాఫర్ మామూలు స్థితికి వచ్చే వరకు డాక్టర్స్‌ని ఫాలోఅప్ చేస్తూ... "ఆ ఫోటోగ్రాఫర్‌కి భయం లేదు, డాక్టర్స్ అన్నీ చూసుకుంటారు, ఏమీ ఫరవాలేదు లేదు" అని మిగతా జర్నలిస్ట్స్‌కి చిరంజీవి మెసేజ్ పెట్టాడు. తోటి జర్నలిస్ట్స్ పట్ల స్పందించిన తీరు, చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెబుతూ నేను చిరంజీవికి మెసేజ్ పెట్టాను. అయన ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా?.. "మనందరం ఒకే కుటుంబం సురేష్. అందులో ఒక తమ్ముడికి ఏదైనా సహాయం కావాలంటే అది నా బాధ్యత, నేను కూడా ఆందోళన చెందుతాను. కుటుంబంలో ఒక బ్రదర్‌లా నేను వెంటనే స్పందించాను" అని అన్నారు. అందుకు కదా అయన మెగాస్టార్ అయ్యాడు... అని అనుకున్నాను. ఇవాళ చాలామంది తాము పాన్ ఇండియా స్టార్స్ అని చెప్పుకుంటారు కానీ, వాళ్ళకి జర్నలిస్ట్స్ పేర్లు కూడా తెలియవు. వాళ్ళని అసలు దగ్గరకి కూడా రానియ్యరు. ఇదీ ఈ పాన్ ఇండియా స్టార్స్ తీరు.గత సంవత్సరం ఏదో సినిమా షూటింగ్‌లో చిరంజీవిని వెళ్లి కలిశాం. నాలుగు సినిమాల షూటింగ్ చేస్తున్నాడు అయన. వాటిలో ఒక సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడున్న ఒక నడివయస్కురాలు ఆ షూటింగ్‌లో వంద మందితో పాటు నటిస్తున్న ఒక ఎంప్లాయ్. చిరంజీవిని చూస్తూ మధ్య మధ్యలో ఏడుస్తోంది. చిరంజీవి ఆమెని దగ్గరకి పిలిచి ఎందుకు ఏడుస్తున్నావ్ నన్ను చూస్తూ... అన్నాడు. ఆమె చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? సార్, కోవిడ్ సమయంలో మమ్మల్ని పట్టించుకున్నవారు లేదు, షూటింగ్స్ లేవు, మాకు జీతం లేదు, ఎలా? అని అనుకుంటున్న సమయంలో మీరు అందరినీ ఆదుకున్నారు. అదీ కాకుండా మీరు ఇలా సినిమాలు చెయ్యడం వలన మాకు పని దొరికి, మాలాంటి వందల కుటుంబాలు మీ మీద ఆధారపడి బతుకుతున్నాయి. మా అందరికీ ఇప్పుడు ఎంతో సంతోషంగా వుందని చెప్పింది. నిజమే కదా అనిపించింది. కోవిడ్ సమయంలో చిరంజీవి డబ్బులు పోగుచేసి సినిమా ఎంప్లాయిస్ అందరికి ఇంటి ఇంటికి వెళ్లి మరీ సరకులు ఇప్పించాడు కదా! అందుకు కదా అయన మెగాస్టార్ అయ్యాడు.సినిమా హిట్ ప్లాప్‌తో సంబంధం లేకుండా, వరసగా సినిమాలు చేసుకుపోతున్నాడు చిరంజీవి. ఎందుకోసం? ఆయన కోసం కాదు. పరిశ్రమ మీదే బతుకుతున్న వందల కుటుంబాలు ఈ రోజు సంతోషంగా ఉండాలంటే, ఆయన అలా వరసగా సినిమాలు చెయ్యాల్సిందే. ఏంట్రా చిరంజీవి అన్ని సినిమాలు ఎందుకు ఒప్పేసుకుంటున్నాడు? అలా ఎలా చేస్తాడు? అనే విమర్శకులకు తెలీదు కదా సినిమావాళ్ళ కష్టాలు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ అని చెప్పుకునే వాళ్ళు, సినిమా చెయ్యడానికి రెండు సంవత్సరాలు పడుతోంది. లుక్ టెస్ట్‌కే వారాలు, నెలలు తీసుకుంటారు. ఇక సినిమా ఎప్పుడు మొదలెడతారో తెలీదు? ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఏదో ప్రాబ్లెమ్ ఉందని ఒక స్టార్ మొదలెట్టి ఆపేస్తాడు. ఇంకో స్టార్ ఏదో సినిమా కథా చర్చలు అని మొదలుపెడతాడు. ఇలా రెండు సంవత్సరాలకి వచ్చిన ఒక సినిమా ఆడుతుందో ఆడదో కూడా తెలియదు. కానీ, అలా కాకుండా, ఒక సినిమా హిట్, ప్లాప్‌తో సంబంధం లేకుండా, సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ఇంకో సినిమా సెట్స్ మీదకి వెళ్లి షూటింగ్ చేస్తున్నాడు చిరంజీవి. ఈ సంవత్సరం ఆచార్య  విడుదలైంది, మొన్న గాడ్ ఫాదర్ వచ్చింది, సంక్రాంతికి వాల్తేర్ వీర్రాజు వస్తుంది, ఏప్రిల్‌లో భోళా శంకర్  వస్తుంది, సమ్మర్ దాటాక ఇంకోటి... ఇలా వస్తూనే ఉంటాయి. పరిశ్రమ కళకళలాడాలన్నా, దీని మీదేబతుకుతున్న ఎందరో శ్రామికులు బతకాలన్నా ఇలా పెద్ద స్టార్ సినిమాలు రావాల్సిందే. మరి చిరంజీవి అదే కదా చేస్తోంది... అందుకు కదా అయన మెగాస్టార్ అయ్యాడు. ఇలాంటి అతని మీద ఎందుకండీ పడతారు? అందరూ అనేవారే!

ఇవాళ చిన్నా.. పెద్ద.. ప్రతీ యాక్టర్ బౌన్సర్ ఉంటే కానీ బయటకే రాడు. వచ్చినా తనో పెద్ద స్టార్ అయిపోయినట్టు ఎవరితోనూ మాట్లాడకుండా, ఎవరినీ దగ్గరికి రానీయకుండా ఏదో మాట్లాడి వెళ్ళిపోతాడు. మరి చిరంజీవి ఆలా కాదే... ఒక ప్రెస్ మీట్ లేదా ఇంకో ఈవెంట్ కో వచ్చినప్పుడు అక్కడ వున్నవాళ్లందరినీ పలకరించుకుంటూ వెళతాడు. ఏమి ప్రభు కనపడటం లేదు... ఏంటి సురేష్ చాలాకాలం అయింది మనం కలిసి... ఏయ్ నాగేంద్ర ఎలా వున్నావు... రాంబాబు మీరు వచ్చారా, ఎలా వున్నారు... ఇలా అందరినీ క్షేమ సమాచారాలు అడుగుతూ వెళుతూ ఉంటాడు. అలాగే అయన ఎక్కడుంటే అక్కడ వందలకొద్దీ జనం కూడా వచ్చేస్తారు. ఆయనకి ఎవరిని నొప్పించే ఉద్దేశం లేదు. అందుకే అంతమంది జనం తన మీద పడుతున్నా, బౌన్సర్‌లను మాత్రం వాళ్ళని ఏమీ అనకండి, ఎంతో దూరం నుండి నన్ను చూడటానికి వస్తుంటారు, మెల్లగా చెప్పండి... అని అంటూనే వుంటారు. అదే అయన మనస్తత్వం. ఎన్ని వందలమంది వున్నా, బౌన్సర్‌లున్నా అయన ఎవరినీ కాదనడు. ఒక వారం క్రితం అనుకుంట... నాకు జరిగినసంఘటన చెప్తాను. గాడ్ ఫాదర్ విడుదలకు ముందు రోజు.

నోవాటెల్ హోటల్‌లో ప్రెస్ మీట్ పెట్టారు. ఒక రిపోర్టర్ మదర్ చీరాల (విజయవాడ దగ్గర) నుండి వచ్చింది. ఆమె చిరంజీవికి డై హార్డ్ ఫ్యాన్. చిరంజీవితో ఒక ఫోటో తీసుకోవాలని ఆమె ఆశ. ప్రెస్ మీట్ అయ్యాక అందరూ తోసుకుంటూ వెళ్లిపోతున్నారు. నేను చిరంజీవిని ఆపి, ఆమె గురించి చెప్పాను. నన్ను కూడా పక్కకి లాగేసారు సెక్యూరిటీ వాళ్ళు. నా చెప్పులు ఎటో పోయాయి. అయినా చిరంజీవి నా చెయ్యి పట్టుకొని... సెక్యూరిటీ వాళ్ళని ఆపి ఏంటని అడిగారు. వెనకాల మ్యూజిక్ సౌండ్ లో సరిగా మాటలు వినిపించకపోయినా ఆమె గురించి నేను చెప్పాను. ఏరీ ఆవిడ అని పిలిపించి, వెంటనే ఆమెతో ఫోటోకి పొజ్ ఇచ్చి మరీ వెళ్లారు. నేను సెక్యూరిటీని తిట్టుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి నేనెవరో తెలీదు. వాళ్ళని తప్పు పట్టలేము, అలాగే అభిమానులు కూడా ఎక్కడెక్కడి నుండో వస్తారు. చిరంజీవి వాళ్ళ కోసం అంత రద్దీలోనూ ఆగి ఫోటోకి పొజ్ ఇచ్చాడు. అలాంటి మనిషి మెగాస్టార్ కాకుండా ఎలా ఉంటాడు? అందుకేనండీ అతన్ని మెగాస్టార్ అంటారు. అతని సంస్కారం చాల గొప్పది. అలాంటి క్రేజ్ వున్న మెగాస్టార్ ఎక్కడున్నా సందడే, అభిమానుల తాకిడే. అదేదో అతను కావాలని చెయ్యడు, అవతలి వాళ్ళని నొప్పించకూడదన్నసంస్కారం అతనిది. అలాంటి మెగాస్టార్‌ని పట్టుకొని... "మీరు ఇటు పక్క రండి... రాకపోతే నేను వెళ్ళిపోతా..." అనడం ఎంత వరకు భావ్యం? సినిమా నటులు ఎక్కడుంటే అక్కడకి జనం వస్తారు, అందులోనూ వచ్చింది మెగాస్టార్ మరి, కచ్చితంగా సందడి ఉంటుంది. ఇవన్నీ తెలుసు, తెలిసీ ఆలా అనటం కొంచెం బాధ కలిగిస్తుంది. ఆయనకి కాదండోయి, ఆయన అభిమానులకి... చిరంజీవికి ఏమి ఉండదు. అయన వెంటనే అటుపక్క వెళ్ళిపోయాడు. చిరంజీవి గౌరవంగానే ప్రవర్తించాడు. అందుకే అతను మెగాస్టార్.

ఈరోజు ప్రతి శుక్రవారం విడుదలైన సినిమాల్లో ఏ సినిమా హిట్ అయితే ఆ సినిమాలో నటించిన నటుడు, పెద్ద స్టార్, పాన్ ఇండియా స్టార్ అని చెప్పుకుంటారు. వాళ్ళు స్టార్స్ మాత్రమే, ఎప్పటికీ మెగా స్టార్ మాత్రం చిరంజీవే. కొన్ని దశాబ్దాల నుండి చిరు చలనచిత్ర పరిశ్రమని ఏలిన పెద్ద స్టార్, మెగా స్టార్. సినిమా విడుదలైనా అవకపోయినా ఆయనే మెగా స్టార్. వాటితో ఆయనకి సంబంధం లేదు. ఎందుకిది చెపుతున్నానంటే, ఈ మధ్య ఇంకో వార్త కూడా చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్‌కి నేనే రీప్లేస్‌మెంట్ అని... అయ్యా, మెగాస్టార్‌కి రీప్లేస్‌మెంట్ ఎవరూ లేరు. అది ఎప్పుడో చెప్పేశారు. ఈ రోజు నువ్వు డబ్బా కొట్టుకొని చెప్పక్కరలేదు అని అభిమానులు ఏనాడో అల్టిమేటం ఇచ్చేసారు. మెగా స్టార్ కి రీప్లేస్‌మెంట్ ఏంటి? అతని స్థాయిలో వందో వంతు చేసిచూపించు, అప్పుడు నిన్ను ముందు ఒక స్టార్‌గా గుర్తిస్తాం. మెగాస్టార్‌కి రీప్లేస్‌మెంట్ ఎవ్వరూ లేరు. ఇది కుండబద్దలు కొట్టినట్టు అభిమానులు చెప్పే నిప్పులాంటి నిజం.

చిరంజీవిలోని మరో పెద్ద గుణం ఏంటో తెలుసా? ఆయన షూటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ కారవాన్‌లో కూర్చోడు. కేవలం దుస్తులు మార్చుకోడానికి మాత్రమే కారవాన్ ఉపయోగిస్తాడు. మిగతా టైంలో అతను బయట కుర్చీలు వేసుకొని ఆ యూనిట్ వాళ్ళతో మాట్లాడతాడు లేదా తన తదుపరి సినిమా గురించో లేక అక్కడున్న మిగతా నటులతో లేదా అదే సినిమా కోసం పనిచేస్తున్న వాళ్ళతో... ఇలా మాట్లాడుతూ అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. నాకు ఇలా అందరితో ఉండటం, వాళ్ళతోటే లంచ్ చెయ్యడం ఇష్టం అంటాడు చిరంజీవి. అంతే కానీ, ఇప్పుడు స్టార్లమని అని చెప్పుకుంటున్న వాళ్ళలా కారవాన్‌కి ఆయన పరిమితం కాదు. ఇప్పటి స్టార్లు ఆ కారవాన్ దిగి రారు. వచ్చినా ముందో నలుగురు, వెనకాల ఓ నలుగురు ఉండాలి. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలన్నది చిరంజీవి మనస్తత్వం. అందుకు కదా అయన అంత ఎత్తుకు ఎదిగాడు. ఇంకా ఎత్తుకు ఎదుగుతున్నాడు కూడా...
ఇక రాజకీయాల మీద కూడా చాలామంది చాలా రకాలుగా రాసేస్తున్నారు. దాసరి గారు పోయాక ఇప్పుడు చిత్ర పరిశ్రమకి ఒక పెద్దన్నయ్య లాంటి చిరంజీవి దొరికాడు. అతను చిత్ర పరిశ్రమ బాగు కోసం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాడు. అలాంటి చిరంజీవి అందరితోనూ స్నేహ సంబంధాలను కలిగి ఉండాలి. అయన కోసం కాదు, పరిశ్రమ కోసం. అందుకనే ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చెయ్యకుండా సైలెంట్‌గా వున్నాడు. ఎందుకంటే, ఒకరికి సపోర్ట్ చేస్తే ఇంకొరు హర్ట్ అవుతారు. అది పరిశ్రమకి మంచిది కాదు. అందుకనే చిరంజీవి సైలెంట్ అయిపోయి అందరితోనూ మంచిగా ఉండాలనుకున్నాడు. ఈరోజు ఈ ముఖ్యమంత్రులు ఉండొచ్చు, రేపు ఇంకొకరు రావొచ్చు. కానీ చిత్ర పరిశ్రమకి మేలు జరగాలంటే, చిరంజీవి లాంటి ఒక పెద్ద మనిషి వెళితే కానీ పనులు జరగవు. అందుకే అయన ఏ పార్టీకి సపోర్ట్ ఇవ్వకుండా సైలెంట్‌గా వున్నాడు.ఇలాంటి మెగాస్టార్ చిరంజీవి మీద ఈ మధ్య లేనిపోని అవాకులు చవాకులు విసురుతున్నారు, విమర్శిస్తున్నారు. ఏం తెలుసు మీకు అయన గురించి? తెలియకపోతే తెలుసుకోండి. ఇది చదవండి. విమర్శించే ముందు ఆలోచించండి. తప్పొప్పులు అందరూ చేస్తారు, కానీ అందులో మంచి వెతకండి. పది మంచి పనులు చేసి ఎక్కడో ఒక తప్పు జరిగితే, ఆ ఒక్క తప్పుని పట్టుకొని లాగొద్దు. మంచిని కూడా చూడండి

మరింత సమాచారం తెలుసుకోండి: