వినూత్న రాజకీయాలతో ముందుకు సాగుతున్న వైసీపీ అధినేత జగన్‌.. ఇటు ప్రజలతోనూ అటు పార్టీ నేతల తోనూ ప్రక్షాళన దిశగానే ముందుకు సాగుతున్నారు. ఆయన తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా కొందరిని బాధించినా.. అందరి మెప్పునూ పొందుతోంది. ఈ క్రమంలో తాజాగా పార్టీలోని నామినేటెడ్‌ పదవుల విషయం లోనూ జగన్‌ ఇలానే తన దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా సీనియార్టీ ప్రాతిపదికన, లేదా సిఫారసుల ప్రాతిపదికన కాకుండా శ్రమ చేసేవారు, పార్టీ కోసం అనేక కష్ట నష్టాలను ఓర్చుకున్న వారికే ఆయన పదవులు కట్టబెడుతున్నారు. 


ఈ విషయాన్ని మంత్రి వర్గ కూర్పులోనే మనం గమనించాం., ఆది నుంచి కూడా పార్టీకి కష్టపడి పనిచేసిన వారిని జగన్‌ అన్ని విధాలా గౌరవించారు. అదే సమయంలో తనకు ఎంతో విలువ నిచ్చి, తనవెంటే నడిచిన వారికి కూడా జగన్‌ మంచి ఛాన్స్‌లు ఇచ్చి ప్రోత్సహించారు. ఇలాంటి వారిలో చాలా మంది మంత్రులు కూడా అయ్యారు. కొడాలి నాని, బొత్స సత్యనా రాయణ, ధర్మాన కృష్ణదాస్‌, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి చాలా మంది ఉన్నారు. అయితే, ఇలానే పార్టీలోకి వచ్చిన నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన ఆనం రామనారాయణ రెడ్డి కూడా పదవులను ఆశించారు. 


తన సీనియార్టీని, గతంలో తాను చేసిన పదవులను పరిగణనలోకి తీసుకుని, తన కేబినెట్‌లో జగన్‌ మంచి ఛాన్స్‌ ఇస్తారని ఆనం అనుకున్నారు. అయితే, కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో తాను ఆహ్వానించినా కూడా రాకుండా టీడీపీలోకి ఆనం సోదరులు వెళ్లిపోవడం జగన్‌కు ఇబ్బంది కలిగించింది. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు సూచనల మేరకు ఆనం సోదరులు జగన్‌పై విమర్శలు కూడా చేశారు. అయినప్పటికీ.. టీడీపీతో విభేదించిన తర్వాత ఆనం వైసీపీలోకి వస్తానని అంటే.. జగన్‌ కాదనలేక పోయారు.ఆయనకు పార్టీ కండువా కప్పి.. ఆహ్వానించారు. 


తాజా ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి గెలిపించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు మంత్రి పదవి వస్తుందని ఆనం అనుకున్నారు. అయితే, ఇప్పటికే పార్టీ కోసం ఎంతో కృషి చేసిన నెల్లూరు నేతలకు మాత్రమే జగన్‌ పదవులు ఇచ్చారు. దీంతో ఆనంను పక్కన కూర్చోబెట్టినట్టయింది. ఇక, అదే సమయంలో డీసీసీబీ చైర్మన్‌ పదవిని తన అనుచరుడు ధనుంజయరెడ్డికి ఇవ్వాలని ఆనం విజ్ఞప్తి చేసినా జగన్‌ పట్టించుకోలేదు. పార్టీ కోసం ఎంతో కృషి చేసిన విజయకుమార్‌ రెడ్డికే జగన్‌ మొగ్గు చూపారు. ఇలా మొత్తానికి ఆనంకు మంత్రి పదవి ఇవ్వక, ఆయన సిఫారసు చేసిన వారికి నామినేటెడ్‌ పదవి కూడా ఇవ్వక‌పోవ‌డంతో ఆనం కాస్త మ‌న‌స్థాపంతోనే ఉన్నార‌ని టాక్‌.



మరింత సమాచారం తెలుసుకోండి: