కనిమొళి.. డీఎంకే దిగ్గజనం కరుణానిధి కూతురు. కేవలం రాజకీయ వారసురాలిగానే కాకుండా.. విషయం ఉన్న నాయకురాలిగా నిరూపించుకున్నారు. ప్రత్యేకించి డీఎంకే భావజాలాన్ని ఆమె పుణికిపుచ్చుకున్నారు. తమిళనాట హిందీ వ్యతిరేక ఉద్యమానికి కనిమొళి తండ్రి కరుణానిధి ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారు. ఆ విషయంలో విజయం కూడా సాధించారు.



ఇక ఇండియా పాలన వ్యవస్థలోనే హిందీ డామినేషన్ ఉంటుంది. ఇది అనేక సార్లు బయటపడింది. తాజాగా కేంద్ర ఆయుష్ శాఖ కార్యదర్శి రాజేశ్ కొటేచా మరోసారి ఆ డామినేషన్ చూపించారు. కేంద్ర ఆయుష్ శాఖ నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో హిందీ అర్థంకానివారు క్లాసు నుంచి వెళ్లిపోవచ్చని ఆయన కామెంట్ చేశారట. దీన్ని కనిమొళి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



ఇంకా ఎంత కాలం ఇలా హిందీయేతర రాష్ట్రాల వారిపై డామినేషన్ కొనసాగిస్తారని ఆమె తన ట్వీట్‌ లో ప్రశ్నించారు. కనిమొళి ఇటీవలే ఓ విమానాశ్రయంలో సెక్యూరిటీ అధికారి తనకు హిందీ రాదని కామెంట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి సీఆర్‌పీఎఫ్‌ అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఇలా హిందీ రాని దక్షిణాది వారిపై వివక్షను కనిమొళి ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు.



మరి ఈసారి కేంద్ర ఆయుష్ శాఖ వెంటనే స్పందిస్తుందా.. కార్యదర్శిపై చర్య తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఏదేమైనా ఈ దేశం అందరిదీ అన్న స్ఫూర్తిని అంతా కొనసాగించాలి. ఒక భాష ఆధిపత్యం ఏమాత్రం మంచిది కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: