కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెక్ పెట్టడం అనేది మామూలు విషయం కాదు...జిల్లాలో దాదాపు అన్నీ నియోజకవర్గాలపై టీడీపీకి పట్టు ఉంది. అలాంటప్పుడు టీడీపీని ఓడించడం అంత సాధ్యమైన పని కాదు. ఏదో ఒకసారి ఓడించినా మళ్ళీ టీడీపీ పికప్ అయ్యే పరిస్తితి. అలాంటిది తిరువూరులో టీడీపీని వైసీపీ ఎమ్మెల్యే రక్షణనిధి వరుసగా ఓడిస్తూ వస్తున్నారు. అయితే తిరువూరు మొదట్లో టీడీపీకి కంచుకోటగా ఉండేది...కానీ తర్వాత అక్కడ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్‌పై వ్యతిరేకత పెరగడంతో టీడీపీకి డ్యామేజ్ జరిగింది.

2004, 2009 ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ గెలిచేసింది. అప్పుడైనా చంద్రబాబు, టీడీపీ నాయకత్వాన్ని మారిస్తే బాగానే ఉండేది...కానీ 2014లో స్వామిదాస్‌నే కంటిన్యూ చేశారు. దీంతో టీడీపీ ఓటమి కంటిన్యూ అయింది. ఈ క్రమంలోనే వైసీపీ తరుపున రక్షణనిధి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే రక్షణనిధికి నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టు లేదు. పైగా 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది..అలాంటప్పుడు టీడీపీ బలపడటానికి మంచి అవకాశం. కానీ ఆ అవకాశాన్ని స్వామిదాస్ ఉపయోగించుకోలేదు. పైగా ఆయనపై వ్యతిరేకత కంటిన్యూ అయింది.

దీంతో 2019 ఎన్నికల్లో స్వామిదాస్‌ని పక్కనబెట్టి కే‌ఎస్ జవహర్‌ని టీడీపీ నుంచి బరిలో దింపారు. అయినా సరే వర్కౌట్ కాలేదు. రక్షణనిధిని ఓడించలేకపోయారు. రెండోసారి గెలిచి రక్షణనిధి దూసుకెళుతున్నారు. ఇప్పుడు టీడీపీకి శావల దేవదత్ ఇంచార్జ్‌గా వచ్చారు.

ఆయన కూడా రక్షణనిధికి చెక్ పెట్టలేరని అర్ధమవుతుంది. తాజాగా తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరిగింది. అయితే ఇప్పుడుప్పుడే కృష్ణాలో టీడీపీ పుంజుకుంటుంది. దీంతో విస్సన్నపేటలో టీడీపీ గట్టి పోటీ ఇస్తుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా విస్సన్నపేట జెడ్పీటీసీని వైసీపీ దాదాపు 6 వేల ఓట్ల మెజారిటీతో గెలుచుకుంది. ఒక మండలంలో ఇంత మెజారిటీ అంటే మామూలు విషయం కాదు. దీనిపై బట్టి చూస్తే రక్షణనిధికి ప్రజల అండ ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఆయన తిరువూరులో ఫ్యాన్ తిరిగేలా చేసేలా ఉన్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: