తెలుగు పత్రికా రంగంలో కొత్త ఒరవడిని ప్రవేశపెట్టి తర్వాత తరానికి స్పూర్తిదాయకంగా నిలిచిన ప్రముఖ పాత్రికేయులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో  పాత్రికేయ ప్రపంచానికి వన్నెతెచ్చిన పాత్రికేయుడు పొత్తూరు పుల్లయ్య గారు . పొత్తూరు పుల్లయ్య గారు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్న అనంతపురం జిల్లా ఉరవకొండ తాలూకా , కొట్టాలపల్లి గ్రామంలో చిన్న రంగప్ప, నారమ్మ దంపతులకు జన్మించారు.

ప్రాథమిక విద్యాభ్యాసం కొట్టాలపల్లిలో  , హై స్కూల్ విద్య ఊరవకొండలో సాగింది. అనంతపురం లో పి. యూ. సి మరియు  డిగ్రీ , ఆ తర్వాత మద్రాస్ ప్రసిడెన్సీ కళాశాలలో ఏం. ఏ తో పాటు ఎల్. ఎల్. బి పూర్తిచేశారు.

 ఆనాటి  ఆంధ్ర ప్రభ సంపాదకులు నార్ల వారి ప్రేరణ తో ఆంధ్ర పత్రికలో పాత్రికేయుడిగా చేరి ఆ పత్రికలోనే  వివిధ హోదాల్లో పనిచేశారు. బెంగుళూరు కేంద్రంగా ఆంధ్ర ప్రభ  పత్రిక  విస్తరణ భాద్యతలు స్వీకరించి పత్రికను పాఠకులకు చేరువ చేయడానికి  వీరు చూపిన  చొరవ , ధీటైన నాయకత్వ లక్షణాలు కారణంగా చెప్పవచ్చు. ఆయన నేతృత్వంలో విజ్ఞాన ప్రభ , సాహిత్యప్రభ , క్రీడాప్రభల పేరుతో ఆంధ్రప్రభ పత్రికలో వెలువడిన ప్రత్యేక సంచికలు తెలుగు పాత్రికేయ రంగంలోనే ఉత్తమ ప్రమాణాలుగా నిలిచాయి.

1980 వ దశకం నుంచి దాదాపు పదెళ్ళ పాటు పుల్లయ్య గారి ఆధ్వర్యంలో వెలువడిన  బెంగుళూరు ఆంధ్రప్రభ పత్రిక ద్వారా  రాయలసీమ జిల్లాలకు చెందిన వార్తల్ని నిజాయితీతో , నిష్పక్షపాతంగా అందించి , దివంగత వై . ఎస్. రాజశేఖర్ రెడ్డి , నేటి చంద్రబాబు నాయుడు  గార్లు  వంటి ఆనాటి యువనేతలకు సమస్యల మీద మార్గదర్శకత్వం వహించిన ఘనత సైతం పుల్లయ్య గారికి దక్కుతుంది.

ఆంధ్ర ప్రభ లో పదవి విరమణ తరువాత ఆంధ్ర జ్యోతి పత్రికలో ప్రతి వారం  "షేర్ సింగ్" పేరుతో ఆయన వ్రాసిన ప్రత్యేక బిజినెస్, షేర్  మార్కెట్ వ్యాసాలు షేర్ మార్కెట్ పై ఆసక్తి కలిగిన వారికి ఎంతో విజ్ఞానదాయకంగా వుండేవి. ఇంగ్లీష్ పత్రికలలో వెలువడే నిపుణుల వ్యాసాలతో పోల్చదగినవిగా వుండేవి. షేర్ మార్కెట్ గురించి తెలుగులో విశ్లేషణాత్మక రచనలు సాగించిన తొలి కాలమిస్టు. ఆయన షేర్ మార్కెట్ వ్యాసాలు నేటి చాలా మంది బిజినెస్ జర్నలిస్టులకు అదర్శమయ్యాయి.

విజయవాడ లో పనిచేస్తున్న సమయంలో విజయవాడ ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కృషి చేయడమే కాకుండా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సంస్థ  కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించారు. నేడు దేశంలో ఉన్న అత్యుత్తమ ప్రెస్ క్లబ్ లలో విజయవాడ ప్రెస్  క్లబ్ ఒకటి.

సహృదయత, నిరాడంబరత , మానవతా విలువల పట్ల గౌరవం , సాటి  ఉద్యోగులు , కార్మికుల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించి వారి సమస్యల పరిష్కారం కోసం పాటుపడే మనస్తత్వం గల వ్యక్తి పుల్లయ్య గారు. 

పాత్రికేయ దిగ్గజం నార్ల వెంకటేశ్వరరావు గారి శిష్యరికంలో పాత్రికేయ  ఓనమాలు దిద్దిన ఆనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక శైలిని అలవార్చుకోవాడమే కాకుండా  పాత్రికేయునికి ఒక ప్రత్యేక శైలి ఉండాలనే ఉద్దేశంతో ఆ దిశగా  యువ  పాత్రికేయులకు  ఈ రంగంలో మార్గదర్శనం చేశారు. ప్రముఖ పాత్రికేయులు వాసుదేవ దీక్షితులు , ఐ . వెంకట్రావు , కె. రామచంద్రమూర్తి మరియు ప్రస్తుత ఆంధ్రజ్యోతి సంస్థ అధినేత వేమూరి రాధాకృష్ణ గార్లు మరియు ఎందరో పాత్రికేయులు వీరి మార్గదర్శనంలోనే  ఎదిగినవారే.

కులమతాభిమానాలు పత్రికారంగాన్ని ప్రభావితం చేయకూడదనే ఆలోచనతో , ఆ ధోరణులను తీవ్రంగా వ్యతిరేకించి , సమగ్ర నిజాయితీలతో ప్రతిభావంతులైన యువ పాత్రికేయులను ప్రోత్సహించిన పుల్లయ్య గారిని పత్రికా రంగం ఎన్నటికీ మారిచిపొదు.

మరింత సమాచారం తెలుసుకోండి: