బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీయార్ వ్యవహారం  చాలా విచిత్రంగా ఉంటుంది. తనను తాను చాలా ఎక్కువగా ఊహించేసుకోవటం ఒక ఎత్తయితే ప్రత్యర్ధులను ఎందుకు పనికిరాని వారుగా చిత్రీకరించటం మరో ఎత్తు. ఇపుడు కేసీయార్ చేసిందిదే. తొందరలోనే  బీఆర్ఎస్ ఏపీ వింగ్ ను ప్రారంభించబోతున్నారు. ఇందులో భాగంగానే సోమవారం నలుగురు ఏపీకి చెందిన వారు బీఆర్ఎస్ లో చేరారు. మాజీమంత్రి రావెల కిషోర్ బాబు, తోట చంద్రశేఖర్, చింతల పార్ధసారధి, టీజే ప్రకాష్ తదితరులు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.





వీరిని పార్టీలో చేర్చుకునేటపుడు వజ్రాల్లాంటి వాళ్ళు బీఆర్ఎస్ లో చేరినట్లు కేసీయార్ అభివర్ణించారు. కేసీయార్ చెప్పినట్లు  నిజంగా వీళ్ళు వజ్రాలేనా ? వాస్తవం మాట్లాడుకుంటే వీళ్ళెవరూ మామూలుజనాల్లో చాలామందికి తెలీదు. వీళ్ళల్లో రావెల మాత్రమే జనాలకు కాస్త పరిచయమున్న వ్యక్తి. ఎందుకంటే టీడీపీ తరపున ప్రత్తికొండలో గెలిచి కొంతకాలం మంత్రిగా పనిచేశారు కాబట్టే. తర్వాత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. ఇక చింతల పార్ధసారధి ఎవరో జనాలు తెలీదు.





తోట మాత్రం కొందరికి తెలుసు. ఎలాగంటే మూడు వరుస ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యంపార్టీ తరపున, 2014లో వైసీపీ అభ్యర్ధిగా, 2019ల ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసి ఓడిపోయారు. కాబట్టి తోట అంటే కొందరు జనాలకు తెలుసంతే. ఇక టీజే ప్రకాష్ 2009లో అనంతపురం అర్బన్ ఎంఎల్ఏగా పోటీచేసి ఓడిపోయారు.





ఇంతోటిదానికే వీళ్ళని కేసీయార్ వజ్రాలనటమే నవ్వు తెప్పిస్తోంది. సరే ఇపుడు వజ్రాలన్న నోటితోనే తర్వాత ఉత్త రాళ్ళు రప్పలని కూడా అనగలరు. అసలు సిసలు రాజకీయం అంటే ఏమిటో ఏపీ జనాలకు చూపిస్తానంటున్నారు. కేసీయార్ రాజకీయం ఏమిటో ఏపీ జనాలకు తెలియందా ? ఉద్యమసమయంలో ఏపీ జనాలను ఎంతగా అవమానించారు ? ఎంతగా తిట్టారో  అందరికీ ఇంకా గుర్తుంది.  ఏపీ ప్రస్తుత దీనావస్ధకు కేసీయారే కారణమన్న విషయం కూడా తెలుసు. మరలాంటి కేసీయార్ ను ఏపీ జనాలు ఆదరిస్తారా ? చూడాలి ఎన్నికల్లో ఏమవుతుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: