ఎంఎల్ఏల కోటాలో భర్తీ అవ్వాల్సిన ఎంఎల్సీ ఎన్నిక రసవత్తరంగా మారబోతోంది. మామూలుగా అయితే భర్తీ అవ్వాల్సిన ఏడు స్ధానాలు ఏకగ్రీవంగా వైసీపీ ఖాతాలో పడాలి. అయితే తెలుగుదేశంపార్టీ తరపున పంచుమర్తి అనూరాధ నామినేషన్ వేయటంతో  పోటీ ఉత్కంఠగా మారింది. నిజానికి టీడీపీకి ఏ విధంగా చూసినా గెలుపు అవకాశంలేదు. ఎందుకంటే ఒక ఎంఎల్సీ స్ధానాన్ని గెలుచుకోవాలంటే 22 ఎంఎల్ఏల ఓట్లుకావాలి. కానీ ఇపుడు టీడీపీకి ఉన్నది 19 మాత్రమే. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున 23 మంది గెలిచినా నలుగురు పార్టీకి దూరమైపోయారు.





కాబట్టి ఇపుడున్న 19 మందితో గెలుపు సాధ్యంకాదు. ఈ విషయం స్పష్టంగా కనిపిస్తున్నా మరి పోటీ ఎందుకు పెట్టినట్లు ? ఎందుకంటే వైసీపీ నుండి తమకు మద్దతు దొరుకుతుందని చంద్రబాబునాయుడు ఆశిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటు చేసిన ఇద్దరు నెల్లూరు ఎంఎల్ఏలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి టీడీపీకి మద్దతుగా ఓట్లేస్తారని అంచనా వేసుకున్నారు. అలాగే నెల్లూరు జిల్లాలోనే ఉన్న మరో ఎంఎల్ఏ, రాజధాని ప్రాంతంలోని మరొక ఎంఎల్ఏ కూడా తమకు ఓట్లేస్తారని చంద్రబాబు అనుకుంటున్నారు.






మరి వీళ్ళిద్దరితో టీడీపీ నేతలు ఏమన్నా టచ్ లోకి వెళ్ళారా అన్న విషయంలో క్లారిటిలేదు. చంద్రబాబు ఆశిస్తున్నట్లుగా ఆనం, కోటంరెడ్డి కూడా టీడీపీకి ఓట్లేసేది చివరివరకు అనుమానమే. జగన్ పై తిరుగుబాటు చేసినా ఇంకా ఏడాదికి పైగా ఎంఎల్ఏలుగా కంటిన్యు అవ్వాలి. జగన్ పై తిరుగుబాటు చేసినా  ప్రభుత్వం ఇబ్బందులు పెట్టకుండా వీళ్ళని అలా వదిలేసింది.





అలాంటిది రేపటి ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేశారని తేలితే ఊరికే వదిలిపెట్టదు. ఆ విషయం వీళ్ళకి కూడా బాగా తెలుసు. అందుకనే వీళ్ళ ఓట్లు పడేంతవరకు అనుమానమే. వీళ్ళ ఓట్లేపడేదే అనుమానమంటే ఇక మరో ఇద్దరి ఎంఎల్ఏల ఓట్లపైన చంద్రబాబు ఎలా నమ్మకం పెట్టుకున్నారో అర్ధంకావటంలేదు. ఇదికూడా ఒకందుకు మంచిదే అనుకోవాలి. ఎందుకంటే ఎవరి బలమేంటో ఓటింగ్ ద్వారా  స్పష్టంగా తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: