పై నినాదాలు ఇస్తున్నది ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు. జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175కి విరుగుడుగా చంద్రబాబునాయుడు వైనాట్ పులివెందుల అనే నినాదాన్ని మొదలుపెట్టారు. వైనాట్..వైనాట్ అనేది మాత్రమే ఇద్దరి నినాదాల్లోను కామన్ గా కనిపిస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఇద్దరి నినాదాల్లోను చాలా వ్యత్యాసమున్నది. జగన్ ఏమో రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లోను గెలిచితీరాలనే పట్టుదలతో ఉన్నారు.





తన ప్రభుత్వం గడచిన నాలుగేళ్ళుగా అమలుచేస్తున్న సంక్షేమపథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కారణంగానే కచ్చితంగా అన్నీ నియోజకవర్గాల్లోను గెలుస్తామనే నమ్మకంతోనే జగన్ వైనాట్ 175 అనే నినాదం మొదలుపెట్టారు. కుప్పం నియోజకవర్గంలో కూడా వైసీపీ గెలిస్తే మిగిలిన అన్నీ నియోజకవర్గాల్లోను వైసీపీ గెలుపు తేలికవుతుందన్నది జగన్ భావన. ఇందులో నుండి వచ్చిందే వైనాట్ 175.





ఇక చంద్రబాబునాయుడు విషయం చూస్తే జగన్ నినాదానికి విరుగుడుగా వైనాట్ పులివెందుల అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. అంటే జగన్ ఏమో అన్నీ నియోజకవర్గాల్లోను గెలవాలని టార్గెట్ పెట్టుకుంటే చంద్రబాబేమో పులివెందులలో గెలుపును టార్గెట్ గా పెట్టుకున్నారు. కుప్పం నియోజకవర్గంలోని స్ధానికసంస్ధలను, మున్సిపాలిటిలో గెలిచిన తర్వాత ఇక్కడ  చంద్రబాబును ఓడించటం అంత కష్టం కాదనే ఆలోచన జగన్ కు వచ్చింది. మరి పులివెందులలో పరిస్ధితి అలాలేదే.




మొన్న జరిగిన మూడు పట్టభద్రుల నియోజకవర్గాల ఎంఎల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన విషయం తెలిసిందే. అప్పటినుండి వైనాట్ పులివెందుల అనే నినాదాన్ని చంద్రబాబు అండ్ కో చాలా బలంగా  వినిపిస్తున్నారు. ఎంఎల్సీ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధమే లేదు.   ఎంఎల్సీ ఎన్నికల్లో ఓటర్లు చాలా పరిమితంగా ఉంటారు. అదే అసెంబ్లీ విషయం చూస్తే సగటున 2.5 లక్షలుంటారు. వైనాట్ పులివెందుల అనే నినాదానికి కారణం ఏమిటంటే టీడీపీ తరపున ఎంఎల్సీగా గెలిచిన భూమిరెడ్డి రామగోపాలరెడ్డి పులివెందుల నేతట. పులివెందుల నేత ఎంఎల్సీగా గెలిచారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో జగన్ కూడా ఓడించవచ్చని చంద్రబాబు అనుకుంటున్నారు. జగన్ ఏమో రాష్ట్రమంతా గెలవాలని అనుకుంటుంటే చంద్రబాబు మాత్రం పులివెందులలో గెలిస్తే చాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో. 


మరింత సమాచారం తెలుసుకోండి: