
రాష్ట్రంలో ప్రతిపక్షాల వ్యవహారం భలే విచిత్రంగా తయారైంది. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతు వైసీపీ విముక్త ఏపీ డిమాండుతో కృషిచేస్తున్నట్లు చెప్పారు. ‘వైసీపీ విముక్త ఏపీ’ అనేది పవన్ కల్యాణ్ నినాదం. ‘సైకో పాలన పోవాలి..సైకిల్ పాలన రావాల’న్నది చంద్రబాబునాయుడు నినాదం. ఇక వామపక్షాలు, కాంగ్రెస్ కూడా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలనే బలంగా కోరుకుంటున్నారు. కాకపోతే వీళ్ళకంటు ప్రత్యేకమైన నినాదలు ఏవీలేవు.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే జగన్ పాలన పోవాలని చంద్రబాబు, పవన్, వామపక్షాలు, కాంగ్రెస్ అనుకుంటే సాధ్యంకాదు. ఎందుకంటే అనుకోవాల్సింది ఓట్లేసే ప్రజలు. జగన్ పాలన వద్దని మెజారిటి జనాలు అనుకుంటేనే వైసీపీ ఓడిపోతుంది. జనాలు కాకుండా ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా, ఎన్ని నినాదాలు ఇచ్చినా ఎలాంటి ఉపయోగముండదు. విచిత్రం ఏమిటంటే జగన్ ఓడిపోవాలని వీళ్ళు బలంగా కోరుకుంటు ఆ కోరిక జనాల్లో ఉందనే నమ్మించే ప్రయత్నంచేస్తున్నారు.
నిజంగానే జనాలంతా జగన్ పాలన పోవాలని బలంగా కోరుకుంటుంటే వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఇంతగా పోరాటాలు చేయాల్సిన అవసరమేలేదు. ఇంట్లోనే కూర్చున్నా వచ్చేఎన్నికల్లో టీడీపీ హ్యాపీగా గెలిచేస్తుంది. జగన్ ప్రభుత్వంపై తిరగబడమని చంద్రబాబు, పవన్ పదేపదే జనాలకు పిలుపిస్తున్నా ఎవరూ పట్టించుకోవటంలేదు. ఎందుకు పట్టించుకోవటంలేదో చంద్రబాబే ఆలోచించుకోవాలి. జగన్ పాలనపై జనాల్లో నిజంగానే వ్యవతిరకతుంటే వాళ్ళే రోడ్లమీదకు వచ్చేస్తారు. తమతో కలిసి పోరాటాలు చేయమని జనాలే చంద్రబాబు, పవన్ను పిలుస్తారు.
మరలాంటి పరిస్ధితి రాష్ట్రంలో ఉందా ? జగన్ పాలనపై వ్యతిరేకతంతా చంద్రబాబు, పవన్తో పాటు ఎల్లోమీడియాలో మాత్రమే కనబడుతోంది. ప్రభుత్వం మీద అసంతృప్తి లేదా వ్యతిరేకత కొందరు జనాల్లో ఎప్పూడు ఉంటుంది. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు పాలనపై జనాల్లో వ్యతిరేకత స్పష్టంగా కనబడింది. పాదయాత్ర చేస్తున్న జగన్ కు జనాలు బ్రహ్మరథం పట్టడమే నిదర్శనం. దాని ఫలితం తర్వాత జరిగిన ఎన్నికల్లో స్పష్టంగా కనబడింది. వైసీపీ 151 సీట్లలో గెలిచిందంటే జగన్ పై సానుకూలత కన్నా చంద్రబాబు మీద వ్యతిరేకతే ఎక్కువుంది. కాబట్టి ఇపుడు కూడా ఎవరి పాలన కావాలి ? ఎవరి పాలన వద్దో నిర్ణయించుకోవాల్సింది జనాలే కానీ చంద్రబాబు, పవన్ కానేకాదు.