మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. తమ భవిష్యత్తు ఏంటో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న  అభ్యర్థుల భవితవ్యం క్రమక్రమంగా తేలిపోతుంది. ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి అధికారులు కౌంటింగ్ మొదలు పెట్టారు. భారీ బందోబస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కౌంటింగ్ చేపడుతున్నారు. ఇకపోతే మున్సిపల్ ఎన్నికలను టిఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రతి చోట టిఆర్ఎస్ పెద్దలందరూ ప్రచార రంగంలోకి దిగి ఓటర్లను ఆకట్టుకునేందుకు తెగ ప్రయత్నాలు చేశారు. ఇక ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో విజయం సాధించిన అభ్యర్థులు... విజయం సాధించని  అభ్యర్థులు ఎవరో  దాదాపు తేలిపోయింది. 

 


 ఇకపోతే మొదటి నుంచి టిఆర్ఎస్ పార్టీ జోరు చూపిస్తుంది. మున్సిపాలిటీ ఏదైనా కార్పొరేషన్ ఎక్కడైనా కారు మాత్రం హండ్రెడ్ స్పీడ్ తో దూసుకుపోతూ మెజారిటీ స్థానాలతో ముందంజలో ఉంది. ఏ రాజకీయ పార్టీ కూడా కారుకు బ్రేక్ వేయలేక పోయింది అని చెప్పాలి. విజయం వైపు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి కూడా నిరాశే ఎదురైంది అని చెప్పాలి. ముఖ్యంగా కాంగ్రెస్ కంచుకోట అయిన ఖమ్మం జిల్లాలో.. కారు జోరును ఆపే వారే లేరు. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం నేత భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర కోటకు.. కారు స్పీడ్ తో బీటలు వారుతున్నాయి. మధిర మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం దిశగా దూసుకుపోతోంది. 

 

 కాగా  ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఎనిమిది వార్డుల్లో ఐదుచోట్ల టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ టిడిపి సిపిఐ ఒక్కో  స్థానంతో సరిపెట్టుకోవాల్సి పరిస్థితి వచ్చింది. మెజారిటీ స్థానాల్లో  టిఆర్ఎస్ పార్టీ ముందంజలో దూసుకుపోయింది. దీంతో కాంగ్రెస్ కంచుకోట లాంటి మధిర మున్సిపాలిటీ పై కూడా తొలిసారి గులాబీ జెండా ఎగురవేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత అయిన భట్టి విక్రమార్కకు మరోసారి భారీ షాక్ తగిలినట్లయింది. ఖమ్మం నియోజకవర్గం లో భారీ విజయం సాధించేందుకు టిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు.. ఎంతో కృషి చేశారూ.

మరింత సమాచారం తెలుసుకోండి: