ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ 63 స్థానాల్లో గెలిచి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బీజేపీ 7 స్థానాలకే పరిమితం కాగా..కాంగ్రెస్‌ ఖాతా కూడా తెరవలేకపోయింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పుపై ఘోర ప‌రాజ‌యం పాలైన ప్ర‌తిప‌క్ష పార్టీల స్పంద‌న‌పై అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్‌, బీజేపీలు త‌మ స్పంద‌న‌ను తెలియ‌జేశాయి.

 

మాజీ క్రికెట‌ర్‌, తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్‌ గౌతమ్‌ గంభీర్ మీడియాతో మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు ప్ర‌జ‌ల తీర్పు అని పేర్కొన్నారు. ‘ఢిల్లీ ఎన్నికల్లో ఓటమిని మేము అంగీకరిస్తున్నాం. ఢిల్లీ ప్రజలకు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు. మేము మా శక్తిమేరకు పనిచేశాం. కానీ, ఢిల్లీ ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోయామనుకుంటా. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను’ అని గంభీర్ అన్నారు. బీజేపీకి చెంది మరో ఎంపీ పర్వేశ్ వర్మ… ‘నేను ఈ ఫలితాలను అంగీకరిస్తున్నాను. తదుపరి ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం సమర్థవంతంగా పనిచేస్తాం’ అని తెలిపారు.కాగా,  ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ ‘ప్రజల తీర్పు మాకు వ్యతిరేకంగా ఉంది.. దీన్ని మేము అంగీకరిస్తున్నాం. మా పార్టీని శక్తిమంతం చేసుకుంటాం’ అని వెల్ల‌డించింది.  

 

 

కాగా  ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నేపథ్యంలో  ఆప్‌  కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ..ఆమ్‌ ఆద్మీ పార్టీపై నమ్మకముంచి మూడోసారి గెలిపించిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు. ఇవాళ ఢిల్లీ ప్రజలకు లార్డ్‌ హనుమాన్‌ దీవెనలు అందించారు. వచ్చే ఐదేళ్లలో ఢిల్లీ ప్రజలకు మరింత సేవ చేసేందుకు సరైన మార్గాన్ని చూపాలని హనుమాన్‌ను  కేజ్రీవాల్‌ కోరుకున్నారు. 
ఢిల్లీ ప్రజలకు కల్పించిన సౌకర్యాలే మాకు గెలుపు బాటలు పరిచాయి. ఢిల్లీ ప్రజలకు తక్కువ ధరకే విద్యుత్‌ అందించాం. సామాన్యుడి కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపించాయి. విద్యుత్‌, నీటి సరఫరా, పౌరసేవలే మమ్మల్ని గెలిపించాయి. విద్య, వైద్యం కోసం చేసిన కృషికి ప్రజలు మళ్లీ మమ్మల్ని ఆదరించారు. మరో ఐదేళ్లపాటు మనమందరం కలిసి కష్టపడదామని కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: