కరోనా కల్లోలం యూరప్‌లో కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకూ ఇటలీ, స్పెయిన్ లో దారుణాలు కథలు కథలుగా చూశాం.. ఇప్పుడు ఆ రెండు దేశాలను మించిపోయి నష్టపోతున్న దేశం మరొకటి తెరపైకి వచ్చింది. అదే బ్రిటన్. 

 

 

ఒక్క రోజులోనే కొన్ని వేలమందిని బలితీసుకున్న ఈ మహమ్మారి ధాటికి బ్రిటన్‌లో తాజాగా 7వందల మందికిపైగా ప్రాణాలు ఒక్కరోజులో గాల్లో కలిశాయి. యూరప్‌లో అత్యధిక మరణాలు నమోదయ్యే దేశంగా బ్రిటన్‌ నిలుస్తుందని నిపుణులు హెచ్చరించారు. అటు చాలా రోజుల తర్వాత ఇటలీలో మరణాల సంఖ్యలో తగ్గుదల నమోదైంది.

 

 

ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య లక్షా 14వేలు దాటగా, కేసుల సంఖ్య 18లక్షల 50వేలు దాటింది. నిన్న అమెరికా తర్వాత బ్రిటన్‌లో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. అక్కడ 7వందల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్‌లో కరోనా మృతుల సంఖ్య 10వేల 6వందలు దాటగా, కొత్తగా 5వేల 2వందలకుపైగా కేసులు నమోదయ్యాయి. బ్రిటన్‌లో కేసుల సంఖ్య 85వేలకు చేరువైంది. 

 

 

బ్రిటన్‌ తర్వాత ఫ్రాన్స్‌లో ఒకేరోజు అత్యధికంగా 561మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా సుమారు 3వేల కేసులు బయటపడగామొత్తం సంఖ్య లక్షా 32వేలు దాటింది. మృతుల సంఖ్య 14వేల 5వందలకు చేరువైంది. మరణాల్లో అమెరికా తర్వాత స్ధానంలో ఉన్న ఇటలీలో 3 వారాల తర్వాత మృతుల సంఖ్యలో తగ్గుదల  నమోదైంది. ఆదివారం 431మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం సంఖ్య 20వేలకు చేరువైంది. 

 

 

ఇటలీలో మొత్తం కేసుల సంఖ్య లక్షా 50వేలు దాటింది. స్పెయిన్‌లో తాజాగా 366 మంది చనిపోగా, మొత్తం సంఖ్య 17వేలు దాటింది. స్పెయిన్‌లో కొత్తగా దాదాపు 4వేల మందికి వైరస్‌ సోకగా మొత్తం సంఖ్య లక్షా 67వేలకు చేరింది. మరో ఐరోపా దేశం బెల్జియంలో నిన్న ఒక్కరోజే 294 మంది ప్రాణాలు కోల్పోగా, మృతుల సంఖ్య 3వేల 6వందలకు చేరింది. కొత్తగా 16వందల కేసులను గుర్తించగా, మొత్తం కేసుల సంఖ్య 30వేలకు చేరువైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: