అమెరికా ఆరోపణలతో.. వైరస్‌ పుట్టుకకు చైనాలో ఉన్న ప్రయోగశాలే వేదికయ్యాయి.. అనే వాదనలు జోరందుకున్నాయి. వైరస్‌ వ్యాప్తిలో చైనా కుట్ర కోణం ఉందన్న విమర్శలకు అమెరికా మరింత బలం ఇస్తోంది. మరి అమెరికా చెబుతున్నట్టు.. ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నట్లుగా ఈ వైరస్‌ కు వుహాన్‌లోని ప్రయోగశాలలే కారణమా..? వైరస్‌ వ్యాప్తి నిజంగా కుట్రేనా..?

 

కరోనా మహమ్మారి రోజు రోజుకి ఊహించని విధంగా విజృంభిస్తోంది. వైరస్ కు ఎలాంటి వ్యాక్సిన్ లేకపోవడంతో.. కరోనాను కట్టడి చేసేందుకు బాధిత దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తూ.. కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా కారణంగా ప్రపంచానికి ప్రపంచమే తాళం వేసుకునే పరిస్థితి ఏర్పడింది. యూరప్ దేశాల్లో, అమెరికాలో కోవిడ్-19 వ్యాప్తి పెరిగిపోతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అక్కడ ఎలాంటి ఫలితం లేకుండాపోతోంది.

 

ప్రపంచవ్యాప్తంగా వైరస్ విజృంభిస్తూ వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. ఈ మహమ్మారికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుందో, ఎలా అరికట్టాలో తెలియక సతమతవుతున్నాయి. ప్రపంచంలోని సగానికిపైగా జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజల ప్రాణాలనే కాదు, వారి జీవనోపాధిని సైతం కరోనా చిన్నాభిన్నం చేసింది. లాక్‌డౌన్ కారణంగా అన్ని రంగాలు స్తంభించిపోవడంతో అన్నీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. కరోనా కట్టడికి లాక్ డౌన్ ప్రధానా ఆయుధంగా మారడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై  తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

 

ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వోకు తాము ఇచ్చే నిధులు దుర్వినియోగం అవుతున్నట్లేనని, అందుకే ఆ నిధులను ఆపేశామని అమెరికా ప్రకటించింది. కరోనా వైరస్‌ మనుషుల నుంచి మనుషులకు సోకుతుందని నివేదికల్లో స్పష్టమైనప్పటికీ.. ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదు. వైరస్‌ ఒకరి ద్వారా మరొకరికి సోకుతుందని వూహాన్‌లో వైద్యులు హెచ్చరించిన తర్వాత కూడా.. జనవరి నెల ముగిసేదాకా డబ్ల్యూహెచ్‌వో తన వైఖరి మార్చుకోలేదని అమెరికా మండిపడింది.

 

ఇక ఇప్పుడు.. కావాలని ఉద్దేశ పూర్వకంగా చేసిన పనికి.. పొరపాటున అదుపు తప్పి జరిగిన పనికి మధ్య.. చాలా పెద్ద వ్యత్యాసం ఉందని ట్రంప్.. చైనాను ఘాటుగా విమర్శించారు. చైనాలో ఏం జరిగిందనే విషయం పై.. ఇప్పటికీ  క్లారిటీ ఇవ్వడం లేదు. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి మిగతా దేశాలకు అనుమతి ఇవ్వడం లేదు. కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అవడం వల్లే  చైనా.. తమ దేశంలోకి ఎంట్రీ కానివ్వడం లేదని అమెరికా బల్లగుద్ది మరీ చెబుతోంది.  ఒకవేళ అమెరికా అనుమానం నిజమైతే.. చైనా తెలిసి తప్పు చేసి ఉంటే.. భవిష్యత్తులో చైనా పై తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ హెచ్చరించారు.

 

ప్రపంచ విపత్కర పరిస్థితి నుంచి బయటపడటానికి చైనా సహకరించడం లేదని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు.  అంతేకాదు.. ల్యాబ్‌ నుంచే కరోనా వైరస్ బయటకు వచ్చిందని ఫ్రెంచ్‌ శాస్త్రవేత్త, నోబెల్‌ అవార్డు గ్రహీత మోంటాజ్ఞయిర్‌ అన్నారు. 'ఎయిడ్స్‌కు మందును కనుక్కొనే క్రమంలో కరోనా బయటకు వచ్చి ఉంటుంది. కరోనా జన్యుపటంలో హెచ్‌ఐవీ, మలేరియా దాఖలాలున్నాయి' ఆయన అన్నారు. వూహాన్‌ నగరంలోని వైరాలజీ ల్యాబ్‌లో 2000 సంవత్సరం నుంచే కరోనా వైరస్‌ ఉందని తెలిపారు. 

చైనాలో కరోనా మరణాల సంఖ్య ఆ దేశ ప్రభుత్వం చెబుతున్న దానికంటే చాలా ఎక్కువే ఉంటుందని అమెరికా  ఆరోపిస్తోంది. అలాగే అమెరికా నిపుణులు కూడా కరోనా వైరస్ ను చైనానే సృష్టించిందని చెబుతున్నారు. వైరస్‌కు నిలయమైన గబ్బిలాలపై వుహన్‌ ప్రయోగశాలలో పరిశోధన చేస్తుండగా, తొలుత అక్కడ పనిచేసే వ్యక్తికి సోకడం ద్వారా వ్యాపించిందని ది ఫాక్స్ న్యూస్ కథనం వెల్లడించింది.  అయితే అమెరికా ఆరోపణలకు సరైనా ఆధారం లేదని.. కరోనా వైరస్ చైనా సృష్టి కాదని.. ఇది జంతువుల నుంచే వ్యాప్తి చెందిందని చైనా చెబుతోంది.

  

అయితే వుహాన్ ల్యాబ్ లో.. పేషెంట్‌ జీరో పనిచేస్తుండటం, ఆమె నుంచి ఈ వైరస్ దావానంలా సామాన్య ప్రజలకు వ్యాపించిందని చెబుతున్నారు. అసలు ఇది జీవాయుధం కాదని.. అందుకే వుహాన్‌ ల్యాబ్‌లో జరిగిన ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు చైనా ప్రయత్నాలు చేసిందని, అక్కడి మార్కెట్‌ ద్వారా వ్యాపించినట్లు చెప్పుకొచ్చిందని ఫాక్స్‌ పేర్కొంది. అత్యంత ప్రమాదకర వైరస్‌లపై పరిశోధన చేస్తున్న వుహాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో భద్రత ప్రమాణాలపై రెండేళ్ల కిందటే యూఎస్‌ ఎంబసీ హెచ్చరించిందని ఇటీవల వాషింగ్టన్‌ పోస్ట్‌ కూడా ఒక కథనాన్ని ప్రచురించింది.     

మరింత సమాచారం తెలుసుకోండి: