లాక్‌డౌన్ పై ప్ర‌ధాన‌మంత్రి మోదీ రేపు స్ప‌ష్ట‌త‌నివ్వ‌నున్న నేప‌థ్యంలో శుక్ర‌వారం సాయంత్రం భార‌త సైన్యం మ‌హాద‌ళాధిప‌తి ప్రెస్‌మెట్ నిర్వ‌హిస్తుండ‌టంతో అంద‌రిలోనూ ఉత్కంఠ నెల‌కొంది. భారత మహా దళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఈరోజు సాయంత్రం 6గంటలకు విలేకరుల సమావేశంలో మాట్లాడనున్న‌ట్లు ఆయ‌న కార్యాల‌య అధికారులు మీడియా సంస్థ‌ల‌కు స‌మాచారం అందించ‌డం ఇప్పుడు అంద‌రిలోనూ ఆస‌క్తి రేపుతోంది. ఆయ‌న‌ విలేకరుల ముందుకు వచ్చి ఏ చెప్ప‌బోతున్నార‌నే దానిపై ప్ర‌జ‌ల్లో టెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. రావత్‌తో పాటు, త్రివిధ దళాధిపతులు సైతం ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

 

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత త్రివిధ దళపతులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.  కేంద్ర ప్రభుత్వం తొలిసారి మహా దళాధిపతి(చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌) పదవిని ప్రత్యేకంగా రూపొందించి ఆ బాధ్యతలను బిపిన్‌ రావత్‌కు అప్పగించిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా లాక్‌డౌన్‌ను ద‌శ‌ల వారీగా ఎత్తివేయాల‌ని భావిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు ఉపశమనం కలిగించేలా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దేశంలోని పలు చోట్ల చిక్కుకున్న కూలీలు, విద్యార్థులు, యాత్రికులు, ఇతరులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.


 ప్రత్యేక రైళ్ల ద్వారా వీరిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. దీంతో పాటు సరకు రవాణాకు ఇబ్బందులు లేకుండా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలనీ.. ట్రక్కుల రవాణాకు అనుమతించాలని ఆదేశించింది. లాక్‌డౌన్ తేదీ  మే3 స‌మీపిస్తున్న కొద్దీ కేంద్ర ప్ర‌భుత్వం ఏం నిర్ణ‌యం తీసుకుంటుందోన‌ని ప్ర‌జ‌ల‌తో పాటు పారిశ్రామిక వేత్త‌లు ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. అయితే లాక్‌డౌన్ విష‌యంలో ఇప్ప‌టికే కొన్ని అత్య‌వ‌స‌ర కార్య‌క‌లాపాల‌కు స‌డ‌లింపునిస్తూ కేంద్రం ఉత్త‌ర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. అయితే మొత్తంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేసే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేద‌న్న‌ది ఎవ‌రూ కాద‌న‌లేని స‌త్యం. లాక్‌డౌన్ కొన‌సాగింపు...స‌డ‌లింపుల‌పై వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు కేంద్రానికి స‌ల‌హాలిస్తున్నారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: