దేశంలో కరోనా వైరస్ తీవ్రరూపం దాలుస్తోంది. ప్రధానంగా వలస కార్మికులు, కూలీలు, విద్యార్థులు, త‌దిత‌రుల‌ను తరలింపు చేపట్టిన తర్వాత పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. వలస కార్మికులు, కూలీల్లో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడంతో ప్రభుత్వాలకు అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. వలస కార్మికులదరినీ క్వారంటైన్‌లో ఉంచడం అనేది ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే ఒక్కొక్కరికి రోజుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇలా సుమారు 28 రోజుల వ‌ర‌కు ఉంచాల్సిన అవ‌స‌రం ఉంది. ఇంత ఖర్చు భరించడం అనేది ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారుతుంది. ఇక్కడ విషయం ఏమిటంటే.. తెలంగాణలోని హైదరాబాద్ నగరం నుంచి 8వేల‌మంది, రంగారెడ్డి నుంచి 5వేల మంది మొత్తంగా సుమారు 13 వేల మంది ఆంధ్ర ప్రదేశ్ వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. వీరందరిని కూడా ఏపీ ప్రభుత్వం క్వారంటైన్‌లో ఉంచాల్సిన అవసరం ఉంది. అక్క‌డే వారికి అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవ‌స‌రం ఉంది. త‌గిన వైద్య‌సిబ్బందిని ఏర్పాటు చేసి, అవ‌స‌ర‌మైన ప‌రీక్ష‌లు చేయాలి. ఇన్నివేల మందిని క్వారంటైన్ చేసి, ఆయా సెంట‌ర్ల‌ను నిర్వ‌హించ‌డం అంత సుల‌భ‌మేమీ కాదు.

 

అలాగే కర్ణాటక, ఛ‌త్తీస్‌గ‌డ్‌, మహారాష్ట్రల‌ నుంచి తెలంగాణకు సుమారు 25 వేల మంది వచ్చేందుకు రెడీగా ఉన్నారు. వీరందరిని కూడా ఇక్కడికి వచ్చాక క్వారంటైన్లో ఉంచాల్సిన అవసరం ఉంది. ఇన్ని వేల మందికి క్వారంటైన్ల సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసి, వారికి అవసరమైన ఏర్పాట్లు చేసి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి మరి. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ లో భాగంగా ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇలా విదేశాల నుంచి వచ్చిన వారికి హైదరాబాదులోని పలు హోట‌ళ్ల‌లో ఏర్పాటు చేసిన పెయిడ్ క్వారంటైన్ల‌లో ఉంచుతున్నారు. ఒక్కొక్క‌రికి సుమారు రూ.30వేల వ‌ర‌కు వ‌సూలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: