కరోనా వైరస్ రాష్ట్రంలోకి వచ్చిన నాటి నుండి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాదు లోనే ఉంటున్న విషయం అందరికీ తెలిసినదే. అక్కడ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై అనేక విమర్శలు చేస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో అడుగుపెట్టి చంద్రబాబు దాదాపు 50 రోజులకు పైగానే గడిచింది. ఇప్పటికీ కూడా రాష్ట్రం లోకి అడుగు పెట్టిన సందర్భాలు లేవు. విశాఖపట్టణంలో ఎల్జి పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీకేజీ విషయంలో కూడా చంద్రబాబు రాష్ట్రానికి రాలేదు. అంతా హైదరాబాదు నుండే విషయాన్ని డీల్ చేయడం జరిగింది.

 

ఇదిలా ఉండగా కరెంట్ ఛార్జీల పెంపు విషయంలో ఏపీ ప్రభుత్వం పై తాజాగా చంద్రబాబు సీరియస్ అయ్యారు. పెంచిన కరెంటు చార్జీల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కమాట కూడా అనకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక విమర్శలు చేశారు. తాజాగా లాక్ డౌన్ కాలానికి గాను మూడు నెలల విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇబ్బంది కలిగేలా వేల రూపాయల విద్యుత బిల్లులు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. చార్జీలు పెంచలేదని అంటూ, శ్లాబులు మార్చడం సరికాదని ఆయన అన్నారు.

 

జగన్ అసత్యాలు చెబుతున్నారని, ప్యాన్ కు ఓటు వేస్తే భవిష్యత్తు ఉంటుందని అనుకున్నవాళ్లు ఇప్పుడు ఇళ్లలో ఫాన్ లు వేసుకోలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. ఇలా అయితే కష్టం అని అన్నారు. కరోనాతో సహజీవనం చేయాలని చెబుతున్నారు. కరోనా అందరికీ రావాలని సీఎం కోరుకుంటున్నారా? ప్రజల జీవితాలతో ఆడుకోవటం మంచి పద్ధతికాదని చంద్రబాబు పేర్కొన్నారు. మరోపక్క అధికారపార్టీ కరెంటు చార్జీల పెంపు విషయంలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువ గా చార్జీలు పెంచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని అంటున్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని తప్పుపడుతున్నారు.  

  

 

మరింత సమాచారం తెలుసుకోండి: