విశాఖ వాతావరణ కేంద్రం రాష్ట్రంలోని కోస్తాంధ్ర‌లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశ‌ముంద‌ని ప్రకటన చేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయ‌ని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజులు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 
 
మరోవైపు రాయలసీమ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ సూచించింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాల యంత్రాంగాన్ని, అధికారులను విపత్తుల శాఖ అప్రమత్తం చేసింది. జూన్‌ 10, 11, 12 తేదీల్లో కూడా కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
మ‌రోవైపు రాయ‌ల‌సీమ‌లో నైరుతి రుతుప‌వ‌నాలు ప్ర‌వేశించాయి. రుతుపవనాల ఆగమనంతో రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో రుతుపవనాలు కోస్తాంధ్ర‌లోనూ విస్త‌రించ‌నున్నాయి. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం రుతుపవనాల ప్రవేశం సమీపిస్తున్న వేళ భారీ వర్షాలకు అవకాశముందని పేర్కొంది. ప్రజలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
రాష్ట్రంలో ఎండలు తగ్గుముఖం పట్టడం.... వర్షాలు కురుస్తూ ఉండటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని... గురువారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని సోమవారం వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.                 

మరింత సమాచారం తెలుసుకోండి: