కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె శైలజకు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి కరోనా వారియర్స్ గౌరవార్థం నిర్వహించనున్న ఈవెంట్ లో మాట్లాడేందుకు.. ఆమెను ఆహ్వానించారు.  ఇండియా నుంచి శైలజకు మాత్రమే ఈ సదస్సులో ప్రాతినిధ్యం వహించబోతుండటం విశేషం. 


ప్రపంచంపై దండయాత్ర చేస్తున్న రాకాసి కరోనా వైరస్ పై కేరళ సర్కార్ సమరభేరీ మోగించింది. ఒకటి రెండు, కేసులు నమోదైన సమయంలోనే  పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకుంది. ట్రేస్, క్వారంటైన్, టెస్ట్, ఐసోలేట్ అండ్ ట్రీట్ విధానాల ద్వారా కరోనాను అదుపు చేయడంలో జాగ్రత్తలు తీసుకుంది. ఫలితంగా ప్రపంచమంతటా మరణశాసనం లిఖిస్తున్న వైరస్... కేరళలో మాత్రం అదుపులోనే ఉంది. ఈ కార్యక్రమంలో ఆరాష్ట్ర వైద్యశాఖ మంత్రి కె.కె.శైలజ.. కీలక భూమిక పోషించారు.

 

చైనాలోని వుహాన్ లో వైరస్ విజృంభణ గురించి తెలియగానే.. అది కచ్చితంగా కేరళకు వస్తుందని గ్రహించారు మంత్రి శైలజ. విశ్వవ్యాప్త అంటు వ్యాధిగా ప్రపంచ ఆరోగ్యసంస్థ డిక్లేర్ చేయనప్పటికీ..  ఈ వైరస్ గురించి తమ టీముతో చర్చించారు.వెంటనే ప్లానింగ్ ప్రారంభించారు. 14 జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ కంట్రోల్ రూములోనూ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశాం. తొలిగా మూడు కేసులు రాగానే వారిని క్వారంటైన్ చేసి, చికిత్స అందించడంతో అది కాంటాక్ట్ వరకూ వెళ్లకుండా ఆపగలిగారు. అంతటితో ఆగకుండా ఫిబ్రవరిలో ఎయిర్ పోర్టుల దగ్గరే స్క్రీనింగ్ చేసి, లక్షణాలున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని క్వారంటైన్ కు తరలించడంతో.. పెను ముప్పును తప్పించగలిగారు. కోవిడ్ చికిత్సలో భాగంగా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అమలు చేశారు. ప్లాన్ ఏలో భాగంగా ప్రతీ జిల్లాలో4వేల500 బెడ్లను ఏర్పాటు చేశారు. ప్లాన్ బిలో వాటిని  పదివేల బెడ్లకు పెంచారు. ప్లాన్ సిలో ఏకంగా హోటల్స్, ఇతర భవనాలను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారు.వీటన్నింటి కారణంగా కేరళలో కరోనా నెమ్మదించింది.

 

ఈమె సేవల్ని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. కరోనా వారియర్స్ గౌరవార్థం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ప్రసంగించేందుకు కె.కె. శైలజను ఆహ్వానించింది. ఇండియాలో ఆమె ఒక్కరికే అవకాశం దక్కింది.

 

పొలిటికల్ లీడర్ గా ...కె.కె.శైలజ.. ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తి. ఓసారి కరోనా ఎఫెక్ట్ అధికంగా ఉన్న సమయంలో ఓ హాస్పిటల్ ను సందర్శించిన శైలజ.. అక్కడి పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెయింటినెన్స్ మరీ అధ్వాన్నంగా ఉందని వైద్య సిబ్బందికి అక్కడే క్లాస్ తీసుకున్నారు. అంతేకాదు.. శైలజకు రాష్ట్రంలో వీరాభిమానులున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: