వైసీపీలో రాజుగారు రాజేసిన నిప్పు ఇంకా చల్లారకపోగా, పొగలు కక్కుతోంది. ఎప్పుడైతే పార్టీ అధిష్టానంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, మీడియా ముందుకు వచ్చి అనేక విమర్శలు చేయడం మొదలుపెట్టారో, పార్టీలోని మిగతా అసంతృప్తులు అంతా ఒక్కొక్కరుగా బయటపడి అధిష్టానం తీరును విమర్శిస్తూ కొద్ది రోజులుగా హడావుడి చేస్తున్నారు. మిగతావారి సంగతి ఎలా ఉన్నా, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. రోజూ ఏదో ఒక సంచలనం సృష్టిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ విధానాలను తప్పు పట్టడం, సొంత పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టడం, వైసీపీ నాయకుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులు చేయడం, ఇలా ఒకటేమిటి రాజుగారు చేస్తున్నహడావుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కుంటోంది. ఆయన్ను కట్టడి చేయకపోతే ముందు ముందు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో, వైసీపీ ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చి వారం రోజుల్లోగా సమాధానాలు చెప్పాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. 

 

ఈ మేరకు వైసిపి ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈ నోటీసును పంపించారు.అయితే ఈ వ్యవహారంపై ఆయన మీడియా ముందుకు వచ్చారు.తనకు బుధవారం మధ్యాహ్నం 18 పేజీల షోకాజ్ నోటీసు వచ్చిందని, అందులో రెండు పేజీలు రిటర్న్ షోకాజ్ కాగా మరో 16 పేజీలు ఉన్నాయి అని చెప్పారు. ప్రభుత్వం ప్రజల మంచి కోసం చేపట్టిన కొన్ని ప్రాంతాల్లో పనులు సజావుగా జరగాలనే విషయాన్ని ... ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరకని కారణంగా మీడియా ముఖంగా సూచనలు చేసినట్లు వివరించారు. తనుకు ఇచ్చిన నోటీసుకు వివరణ ఇచ్చేందుకు వారం రోజుల సమయం ఉన్నా, తాను రేపు సమాధానం చెబుతాను అంటూ రఘురామా కృష్ణంరాజు వ్యాఖ్యానించారు


.రేపు ఏ  సంచలన విషయాలు బయట పెడతాడో, పార్టీపై ఎటువంటి విమర్శలు చేస్తాడో అనే టెన్షన్ ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. ఆయన బిజెపి కండువా కప్పుకునేందుకు ఇలా అసమ్మతి రాగం వినిపిస్తున్నారని, ఆయన వెనుక ఖచ్చితంగా బిజెపి ఉందనే అనుమానాలు వైసీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారం ఎటువైపు వెళుతుందో ... ఎంత దుమారం రేపుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: